సీనియర్ల సేవల్ని వినియోగించుకుంటాం

మంత్రివర్గంలో చోటు కల్పించలేని సీనియర్‌ నాయకుల సేవల్ని వేరే రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సీనియర్‌ నాయకులు కొందరు చంద్రబాబును సచివాలయంలో కలిశారు.

Published : 15 Jun 2024 05:40 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
కొందరు నేతలతో ఏకాంతంగా మాట్లాడిన అధినేత

ఈనాడు, అమరావతి: మంత్రివర్గంలో చోటు కల్పించలేని సీనియర్‌ నాయకుల సేవల్ని వేరే రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సీనియర్‌ నాయకులు కొందరు చంద్రబాబును సచివాలయంలో కలిశారు. ఒక్కొక్కరితో పది నిమిషాలపాటు ఆయన ఏకాంతంగా మాట్లాడారు. చంద్రబాబును కలిసినవారిలో యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులున్నారు. మంత్రివర్గ కూర్పులో అనుసరించిన విధానం, కుల, మత, ప్రాంత సమీకరణాల సమతూకం పాటించిన తీరును చంద్రబాబు వారికి వివరించారు. వారికి మంత్రివర్గంలో ఎందుకు అవకాశం కల్పించలేకపోయారో చెప్పారు. సీనియర్ల సేవలు, సూచనలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని.. క్యాబినెట్‌లో చోటు దక్కని వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న తమ లక్ష్యం నెరవేరిందని సీనియర్‌ నేతలు ఆయనతో పేర్కొన్నట్టు తెలిసింది. మంత్రివర్గానికి సంబంధించి మీరు అనుసరించిన విధానాన్ని తాము అర్థం చేసుకోగలమన్నారు. అధినేతగా మీరు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అధినేతను కలిసినవారిలో అత్యధికులు.. శాసనసభ స్పీకర్‌ పదవిని ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని