పెద్దిరెడ్డి పాపాల నిగ్గు తేల్చాలి

అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ఐదేళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అక్రమాలు.. అరాచకాలకు పాల్పడ్డారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్‌ ఆరోపించారు.

Published : 15 Jun 2024 05:51 IST

సీఎం చంద్రబాబుకు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ లేఖ 

ఈనాడు, అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ఐదేళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అక్రమాలు.. అరాచకాలకు పాల్పడ్డారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్‌ ఆరోపించారు. పెద్దిరెడ్డి బాగోతాన్ని నిగ్గుతేల్చాలని, ఆయన కుటుంబం అక్రమాలపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘గత ఐదేళ్ల చెత్త పాలన, అరాచకాలు, అక్రమాలు మీకు తెలియనివి కాదు. వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తారని ఈ లేఖ రాస్తున్నా. గనుల్లో విచ్చలవిడిగా దోచుకున్నారు. ప్రతి క్వారీలో అనుచరులను పెట్టి అక్రమంగా ఆర్జించారు. తాను మంత్రిగా ఉన్న విద్యుత్తు శాఖలో కాంట్రాక్టులు, ఒప్పందాలు, కేటాయింపుల ద్వారా రూ. వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. మీ నియోజకవర్గం కుప్పం సహా పుంగనూరు, పలమనేరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు చేసిన అరాచకాలు, భూ కబ్జాలు, ఆగడాలపై సమగ్ర విచారణ జరిపి నిగ్గు తేల్చాలి. పెద్దిరెడ్డి దోచుకున్నవాటిని కక్కించాలి’ అని కోరారు. ‘గత ఐదేళ్లలో పుంగనూరు సహా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలపై జరిగిన దాడులు, వేధింపులు, అక్రమ కేసులపై విచారణకూ ప్రత్యేక కమిటీని వేయాలి. ’ అని కోరారు.

మీ విజయం చిరస్మరణీయం..: ‘మీ విజయం చిరస్మరణీయం. ఈ అద్భుత విజయానికి మీకు, కూటమి నేతలందరికీ శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చి, గత పాపాలను కడిగి, రాష్ట్రానికి తగిలిన గాయాలను రూపుమాపి, మంచి చేస్తుందని ఆశిస్తున్నా’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని