ఆర్టీసీ ఐ-టిమ్స్‌ టెండర్లలో కుంభకోణం

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా... గత ఆరు నెలల పాలనలో వరస కుంభకోణాలకు పాల్పడిందని భారాస పేర్కొంది. మద్యం, బియ్యం, ఫ్లైయాష్, తాజాగా ఆర్టీసీ ఐ-టిమ్స్‌ టెండర్ల భారీ కుంభకోణం జరిగిందని భారాస నేత మన్నె క్రిశాంక్‌ ఆరోపించారు.

Updated : 16 Jun 2024 06:44 IST

అవినీతిపై సీఎం స్పందించాలి: భారాస

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా... గత ఆరు నెలల పాలనలో వరస కుంభకోణాలకు పాల్పడిందని భారాస పేర్కొంది. మద్యం, బియ్యం, ఫ్లైయాష్, తాజాగా ఆర్టీసీ ఐ-టిమ్స్‌ టెండర్ల భారీ కుంభకోణం జరిగిందని భారాస నేత మన్నె క్రిశాంక్‌ ఆరోపించారు. రోజూ 52 లక్షల మంది ప్రయాణికులకు జారీ చేసే డిజిటల్‌ టికెట్ల ప్రాజెక్టును ఒకే సంస్థకు కట్టబెట్టారని... ఆన్‌లైన్‌లో జరగాల్సిన ప్రక్రియను ఆఫ్‌లైన్‌కు మార్చారని... అనేక సవరణలు చేశారని పేర్కొన్నారు. శనివారమిక్కడ తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు రవాణా సంస్థలో అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని డిమాండ్‌చేశారు. ‘ఆర్టీసీలో ఐ-టిమ్స్‌ (ఇంటిలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మెషీన్స్‌) కోసం గత ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో జారీ చేసిన టెండర్లను ప్రస్తుత ప్రభుత్వం కారణం లేకుండా రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం పిలిచిన టెండర్లను అంతర్గతంగా నిర్వహించారు. జనవరి 11, 2024న ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఉన్న టెండర్‌ను అకస్మాత్తుగా ఆఫ్‌లైన్‌ మోడ్‌కు ఎందుకు మర్చారు? ‘చలో మొబిలిటీ’కి కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? ఈ టెండర్‌కు ఎన్ని బిడ్లు దాఖలయ్యాయి? ఎంత ధర కోట్‌ చేశారు? ఈ వివరాలన్నీ ఎందుకు గోప్యంగా ఉంచారు?’ అని ప్రశ్నించారు. ఐ-టిమ్స్‌ టెండర్లకు నెల రోజుల వ్యవధిలోనే 14 సవరణలు తీసుకురావడం వెనక కారణాలను, కాంట్రాక్టులో గోప్యతకు కారణాలను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించాలి అని క్రిశాంక్‌ కోరారు. ‘చలో మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థకు 13,200 టిక్కెట్‌ ఐ-టిమ్స్‌ మెషీన్ల కాంట్రాక్టు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్ల పాటు రోజుకు 52 లక్షల టికెట్ల జారీపై ఇచ్చే కమీషన్‌ ఆ సంస్థకు భారీ ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని