ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌పై మరోసారి దర్యాప్తు జరపాలి

విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు, ఆయన సహచరుడు జీవీ కిడ్నాప్‌ కేసును మరోసారి దర్యాప్తు చేయాలని జనసేన నాయకుడు, కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 16 Jun 2024 09:11 IST

విశాఖపట్నం (సీతంపేట), న్యూస్‌టుడే: విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు, ఆయన సహచరుడు జీవీ కిడ్నాప్‌ కేసును మరోసారి దర్యాప్తు చేయాలని జనసేన నాయకుడు, కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ డిమాండ్‌ చేశారు. విశాఖ పౌరగ్రంథాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కిడ్నాప్‌ ఘటన జరిగి సంవత్సరం పూర్తవుతోంది. ఇప్పటికీ సస్పెన్స్‌ వీడలేదు. అప్పటి ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు వివరాలను తొక్కిపెట్టేశారు. ఇది కిడ్నాప్‌ కాదని, కేవలం కొందరు అమాయకులు, ఎన్నారైలు, కొందరు పెద్దల నుంచి రౌడీయిజం, గుండాగిరీ చేసి దోచుకొన్న సొమ్మును పంచుకొనే విషయంలో వచ్చిన విభేదాలే ఘటనకు కారణమనే వాదనలు ఉన్నాయి. వీటన్నింటినీ నిగ్గు తేల్చేందుకు ఈ కేసును తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేయాలి’ అని పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన నిందితుడు వెంకట్‌ ద్వారా రూ.వేల కోట్ల విలువ చేసే వందల ఎకరాల ఆస్తులు, స్థలాల సెటిల్‌మెంట్లు జరిగాయని, ఇవన్నీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీల కోసమే జరిగాయనే ఆరోపణలున్నాయని మూర్తియాదవ్‌ అన్నారు. నిందితుడి దగ్గర ఉన్న కార్లలో కొన్ని ఎంవీవీ వియ్యంకుడు, బెంగళూరుకు చెందిన మేకా సత్యనారాయణ బహుమతిగా ఇచ్చారని తెలిపారు. కిడ్నాపర్లకు, ఎంవీవీ వియ్యంకుడికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని