భాజపాతో విభేదాల్లేవ్‌

భాజపాతో ఎటువంటి విభేదాల్లేవని ఆర్‌ఎస్‌ఎస్‌ స్పష్టం చేసింది. ఇటీవల సంఘ్‌ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ వివరణ ఇచ్చింది.

Updated : 16 Jun 2024 06:30 IST

ఆర్‌ఎస్‌ఎస్‌ వివరణ
సిద్ధాంతకర్త ఇంద్రేశ్‌ యూటర్న్‌ 

దిల్లీ: భాజపాతో ఎటువంటి విభేదాల్లేవని ఆర్‌ఎస్‌ఎస్‌ స్పష్టం చేసింది. ఇటీవల సంఘ్‌ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ వివరణ ఇచ్చింది. ‘నిజమైన సేవకుడు అహంకారం కలిగి ఉండడు. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు’ అంటూ ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ స్పందన రావడం చర్చనీయాంశమైంది. దీనిపైౖ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు స్పందించాయి. తమకు భాజపాతో ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల తరవాత భాగవత్‌ చేసిన ప్రసంగానికి, తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి. భాగవత్‌ తాజా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడంతో గందరగోళం నెలకొందని తెలిపాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా భాజపాపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఇంద్రేశ్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. ‘దేశ ప్రజల ఆలోచన ఏంటో స్పష్టంగా ఉంది. రాముడిని వ్యతిరేకించినవారు అధికారాన్ని కోల్పోయారు. ఆయనను గౌరవించినవారు అధికారం దక్కించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైంది’ అని ఆయన స్పష్టత ఇచ్చుకున్నారు. గతంలో ఇంద్రేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘భక్తి చూపి, తర్వాత అహంకారం పెంచుకున్న పార్టీ 240 దగ్గర ఆగిపోయింది. రాముడిని వ్యతిరేకించినవారు 234 వద్ద ఆగిపోయారు’ అంటూ అధికార, విపక్ష కూటములపై విమర్శలు చేశారు. ఇవి వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు