బెంగాల్‌ దాడుల అధ్యయనానికి కమిటీ: భాజపా

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతరం తమ పార్టీ కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న హింసపైన అధ్యయనానికి భాజపా నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.

Updated : 16 Jun 2024 06:33 IST

దిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతరం తమ పార్టీ కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న హింసపైన అధ్యయనానికి భాజపా నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కమిటీని ప్రకటించారు. భాజపా ఎంపీలైన విప్లవ్‌కుమార్‌ దేవ్, రవిశంకర్‌ ప్రసాద్, బ్రిజ్‌ లాల్, కవితా పాటీదార్‌లు ఇందులో సభ్యులు. కమిటీకి దేవ్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం పశ్చిమబెంగాల్‌లో భాజపా కార్యకర్తలు, సానుభూతిపరులపై తృణమూల్‌ వర్గాలు దాడులకు పాల్పడుతున్నాయనీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీటిని ఆపకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని భాజపా ఆరోపిస్తోంది. ఎన్నికల్లో వైఫల్యానికి సాకులు వెతుకుతూ భాజపా తమపై ఆరోపణలు చేస్తున్నట్టు తృణమూల్‌ వర్గాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు.. కూచ్‌బిహార్‌ జిల్లాలో దాడుల బాధితుల్ని ప్రతిపక్ష నేత సువేందు అధికారి శనివారం పరామర్శించారు. గవర్నర్‌ నుంచి అనుమతి వస్తే, దాడుల కారణంగా నిరాశ్రయులైన 100 మందితో కలిసి ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయన్ని కలుస్తానని సువేందు ప్రకటించారు. రాజ్‌భవన్‌ ముందు బాధితులతో కలిసి ఐదురోజుల బైఠాయింపు కోసం పోలీసుల అనుమతి కోరినట్టు తెలిపిన సువేందు.. ఇదే చోట గత నవంబరులో తృణమూల్‌ నేత అభిషేక్‌ బెనర్జీ తన పార్టీ మద్దతుదారులతో ధర్నా చేపట్టారనీ, అప్పుడు అనుమతి ఇచ్చిన పోలీసులు తమ విషయంలో భిన్నంగా వ్యవహరించకూడదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు