ఇందిరాగాంధీ మదర్‌ ఆఫ్‌ ఇండియా

మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్‌ ఆఫ్‌ ఇండియాగా కేంద్ర మంత్రి, కేరళలోని త్రిశ్శూర్‌ భాజపా ఎంపీ సురేశ్‌ గోపి అభివర్ణించారు.

Updated : 16 Jun 2024 06:32 IST

కరుణాకరన్, నయనార్‌ నాకు గురుతుల్యులు
కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి వ్యాఖ్యలు

త్రిశ్శూర్‌: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్‌ ఆఫ్‌ ఇండియాగా కేంద్ర మంత్రి, కేరళలోని త్రిశ్శూర్‌ భాజపా ఎంపీ సురేశ్‌ గోపి అభివర్ణించారు. కాంగ్రెస్‌ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్, మార్క్సిస్టు నేత ఈకే నయనార్‌ తన రాజకీయ గురువులని పేర్కొన్నారు. మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన.. శనివారం త్రిశ్శూర్‌లో పర్యటించారు. కరుణాకరన్‌ స్మారకమైన మురళీ మందిరాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన గురు సమానులైన కరుణాకరన్‌కు నివాళులర్పించేందుకే ఇక్కడికి వచ్చానని సురేశ్‌ గోపి తెలిపారు. దీనిని రాజకీయాలను ఆపాదించొద్దని సూచించారు. కరుణాకరన్‌తో తనకు మంచి సంబంధాలు ఉండేవని, ఆయన సతీమణి కల్యాణి కుట్టి తనకు తల్లి వంటి వారని పేర్కొన్నారు. మార్క్సిస్టు నేత నయనార్, ఆయన భార్య శారద టీచరన్‌ను సైతం తల్లిదండ్రులతో సమానంగా భావిస్తానని చెప్పారు. కన్నూర్‌లోని నయనార్‌ నివాసాన్ని ఇటీవలే సందర్శించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీని మదర్‌ ఆఫ్‌ ఇండియాగా అభివర్ణించారు. పాలన విషయాల్లో ఆమె సాహసోపేత నిర్ణయాలు తీసుకునేవారని పేర్కొన్నారు. 2019లోనే మురళీ మందిరాన్ని సందర్శించాలని అనుకున్నానని, రాజకీయ కారణాలవల్ల అప్పట్లో కుదరలేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మూల పురుషుడు కరుణాకరన్‌ అని చెప్పారు. త్రిశ్శూర్‌ నుంచి సురేశ్‌ గోపి విజయం సాధించారు. సీపీఐ నేత వీఎస్‌ సునీల్‌ కుమార్‌పై 74వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. సురేశ్‌ గోపికి 4.12 లక్షల ఓట్లు రాగా, సునీల్‌ కుమార్‌కు 3.37 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నేత కె.మురళీధరన్‌కు 3.28 లక్షల ఓట్లు పోలయ్యాయి. సురేశ్‌ గోపి కొనియాడిన కరుణాకరన్‌ తనయుడే ఈ మురళీధరన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు