విద్యుత్‌ వ్యవహారంపై విచారణ కమిషన్‌ అసంబద్ధం

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే విద్యుత్‌ ఒప్పందం కుదుర్చుకుందని, విద్యుత్‌ కొనుగోలులో కేసీఆర్‌ ఆ రాష్ట్ర మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు ఏమైనా లంచం ఇచ్చారా? అనేది భాజపా నేతలు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 17 Jun 2024 04:54 IST

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే విద్యుత్‌ ఒప్పందం కుదుర్చుకుందని, విద్యుత్‌ కొనుగోలులో కేసీఆర్‌ ఆ రాష్ట్ర మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు ఏమైనా లంచం ఇచ్చారా? అనేది భాజపా నేతలు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రాల నిర్మాణాలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే ఒప్పందం చేసుకున్నామని, ఏమైనా అవినీతి జరిగి ఉంటే కేంద్రం నిజానిజాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ వ్యవహారంపై విచారణ కమిషన్‌ అసంబద్ధంగా ఏర్పాటు చేశారని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డిపై మాకు సంపూర్ణ గౌరవం ఉంది. ఆయన న్యాయబద్ధంగా ఉంటారని భావించాం. మాకు ఇచ్చిన గడువు ప్రకారం సమాధానం ఇవ్వాలని అనుకున్నాం. కానీ కాంగ్రెస్, భాజపా నేతల అభిప్రాయాలను జస్టిస్‌ నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. 15వ తేదీ వరకు సమయమిచ్చి.. 11నే మీడియా సమావేశం ఎలా ఏర్పాటు చేశారు? విచారణ పూర్తి కాకముందే నష్టం జరిగిందని ఎందుకు మాట్లాడారో సమాధానమివ్వాలి? కమిషన్‌ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. అందుకే తెలంగాణ సమాజానికి నిజాలు చెప్పడానికి కేసీఆర్‌ లేఖలు రాశారు. కమిషన్‌ బాధ్యతల నుంచి జస్టిస్‌ నరసింహారెడ్డి వైదొలుగుతారని భావిస్తున్నాం. కాంగ్రెస్, భాజపాలు కలిసి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయి’’ అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు