‘నీట్‌’పై సమగ్ర విచారణ చేపట్టాలి

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్‌పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. మోదీ సర్కార్‌ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు.

Published : 17 Jun 2024 04:55 IST

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్‌పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. మోదీ సర్కార్‌ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రతిసారి విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్‌పై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎన్డీయే ప్రభుత్వానికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘‘గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్‌లో ఏకంగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంక్‌ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోంది. అందులోనూ ఒకే సెంటర్‌ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్‌ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి. ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు? లక్షల మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం స్పందించలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్క గ్రేస్‌ మార్కుల అంశమే కాకుండా.. నీట్‌ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. దీనికి బలం చేకూరే విధంగా గుజరాత్, బిహార్‌ రాష్ట్రాల్లో నీట్‌లో అవకతవకలకు పాల్పడిన కొంతమందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరుసగా బయటపడుతున్న వివాదాస్పద వ్యవహారాల కారణంగా నీట్‌ తీరుపై అనుమానాలు బలపడుతున్నాయి. పేపర్‌ లీకేజీ ఆరోపణల కారణంగా తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. వారి తరఫున భారాస పోరాటం చేస్తుంది’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

సీఎం రేవంత్‌రెడ్డి పెదవి విప్పడం లేదు: గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌

‘‘నీట్‌ పరీక్ష పేపర్‌ కచ్చితంగా లీకైంది. గుజరాత్‌లో పరీక్ష పేపర్లు అమ్ముకున్నారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి పెదవి విప్పడం లేదు. కేసీఆర్‌పై ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నారు’’ అని భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలు నీట్‌పై కేంద్రాన్ని నిలదీయాలి. విద్యా శాఖను తన వద్ద పెట్టుకుని సీఎం ఇప్పటి వరకు సమీక్ష చేయలేదు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని