గత ప్రభుత్వ భూ హక్కు పత్రాల పంపిణీ నిలిపివేత!

గత వైకాపా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించిన భూ హక్కు పత్రాల పంపిణీని నిలిపివేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 18 Jun 2024 04:19 IST

ఈనాడు, అమరావతి: గత వైకాపా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించిన భూ హక్కు పత్రాల పంపిణీని నిలిపివేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ సీఎం జగన్‌ తన సొంత భూమిని భూ హక్కుపత్రం పేరుతో రైతులకు ఇస్తున్నట్లుగా పట్టాదారు పుస్తకాన్ని తయారుచేయించారు. ఒక్కో పుస్తకం కోసం రూ.60 వరకు ఖర్చుపెట్టారు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో 20 లక్షల మంది రైతులకు ఈ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని నాటి వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఎన్నికల ముందు వరకు వీటిని అందజేశారు.  తర్వాత ఎన్నికలు రావడంతో కొన్ని గ్రామాల్లో రైతులకు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పుస్తకాలు వేల సంఖ్యలో ఉన్నట్లు గుర్తించి రైతులకు పంపిణీ చేయొద్దని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రీ-సర్వే కొనసాగించాలా? వద్దా? కొనసాగిస్తే ఎలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గత కొన్ని దశాబ్దాలుగా రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. భూ యజమానుల పేరు, స్థల వివరాల వరకు పరిమితం కావాల్సిన పట్టాదారు పుస్తకాన్ని వైకాపా ప్రభుత్వం.. జగనన్న భూ హక్కుపత్రం పేరుతో తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. ఆ పుస్తకాల్లో యజమాని ఫొటో కంటే.. మాజీ సీఎం జగన్‌ ఫొటో పెద్ద సైజులో ముద్రించడంపై రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.

సర్వే రాళ్ల విషయంలో..

ప్రతి సర్వే రాయిపై వైఎస్సార్‌ జగనన్న భూరక్ష-2020 పేరు ఉండేలా గత పాలకులు చర్యలు తీసుకున్నారు. అయితే రీసర్వే చేసిన గ్రామాలకు సరఫరా చేయకుండా లక్షల సంఖ్యలో రాళ్లు గ్రానైట్‌ పరిశ్రమల్లో నిల్వ ఉన్నాయి. వాటిపై రంగు వేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని