సంక్షిప్త వార్తలు(11)

నీట్‌ నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై న్యాయవిచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated : 18 Jun 2024 06:19 IST

20న ‘నీట్‌’ అవకతవకలపై నిరసన ప్రదర్శనలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

రాంనగర్, న్యూస్‌టుడే: నీట్‌ నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై న్యాయవిచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష రాసిన సుమారు 24 లక్షల మంది విద్యార్థులతోపాటు తల్లిదండ్రులూ ఆందోళన చెందుతున్నారన్నారు. పరీక్ష రాసినవారిలో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులున్నారని పేర్కొన్నారు. నీట్‌లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశించడం సహా విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 20న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 


మోదీ పాలనలో అస్తవ్యస్తంగా రైల్వేశాఖ

- ఖర్గే, రాహుల్‌గాంధీ విమర్శలు

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో రైలుప్రమాదం చోటుచేసుకోవడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రైల్వే శాఖ అస్తవ్యస్తంగా మారిందని వారు ఆరోపించారు. సర్కారు వైఫల్యాల వల్లే రైలుప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. బెంగాల్‌ రైలుప్రమాద బాధితుల తరఫున తాము పోరాడతామని ఖర్గే ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా తక్షణమే అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


రేయింబవళ్లూ కార్యకర్తలకు అండగా నిలిచారు
తెదేపా న్యాయ విభాగానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వ అరాచకాలపై పోరాడిన తెదేపా కార్యకర్తలకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా తెదేపా న్యాయవిభాగం అండగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. జగన్‌ అయిదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటంలో ఈ విభాగం కీలకపాత్ర పోషించిందన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో న్యాయ విభాగం సభ్యులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు జగన్‌
తెదేపా ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి 

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘మీ ఇంటి ముందుకు మీడియా వస్తేనే భరించలేకపోతున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటి మీద డ్రోన్లు ఎగరేసిన సంగతి మరిచారా’ అని మాజీ సీఎం జగన్‌ను తెదేపా ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజావేదికను కూల్చిన విషయం మీకు గుర్తులేదా? అని ‘ఎక్స్‌’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్మ ఎవర్నీ వదలిపెట్టదని హితవుపలికారు. ‘‘సీఎంగా ఉన్నంత వరకు పరదాలు. ఇప్పుడు ప్రైవేటు సెక్యూరిటీ. వీరిలోనూ కడుపు మండిన పేదలు ఉంటారు గుర్తుంచుకోండి’’ అని అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.


ఐదేళ్లుగా ఆర్థిక విధ్వంసం

ఏమైనా అడుగుతుంటే మిన్నకుండిపోతున్న అధికారులు
మంత్రి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, విడపనకల్లు, న్యూస్‌టుడే: గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసిందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని తెలుసుకుందామనుకుంటే ఇప్పటికే ఒక ముఖ్య అధికారి సెలవులో వెళ్లిపోయారు. మరో అధికారి అందుబాటులో లేరు. కనీసం ఏమి జరిగిందో కొత్త ప్రభుత్వానికి వివరించడానికి కూడా వారు సాహసించడం లేదు. దీనిని బట్టి వైకాపా ప్రభుత్వ ఆర్థిక దురాగతాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు. గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో సమగ్రంగా తెలుసుకుని, రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని స్పష్టం చేశారు.


‘ఆ ఉన్నతాధికారుల్ని తొలగించాలి’

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, ఆ శాఖలోని జేడీ రామలింగం, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డిలను సస్పెండ్‌ చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. వీరు ముగ్గురు ఉపాధ్యాయుల అక్రమ బదిలీ ప్రక్రియలో అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు వారధుల్లా పనిచేశారని ఆరోపించారు. ఎన్నికల్లో వైకాపాకు ఓటేయాలని వారు ప్రచారం చేశారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


రుషికొండ ప్యాలెస్‌ వ్యయంపై విచారణ చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: విశాఖలోని రుషికొండపై రూ.450 కోట్లు వెచ్చించి నిర్మించిన ప్యాలెస్‌ వ్యయంపై విచారణ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. పేదలకు సెంటు స్థలంలోనే ఇళ్లు నిర్మించి.. మాజీ సీఎం జగన్‌ మాత్రం రుషికొండపై రాజమహల్‌ నిర్మించుకోవడాన్ని సోమవారం ఓ ప్రకటనలో ఖండించారు. ‘ఎన్నికల ముందు వరకు రాజధానిని విశాఖ మారుస్తామని, అక్కణ్నుంచే పాలన సాగిస్తామని జగన్‌ పలుమార్లు ప్రకటించారు. తన నివాసాన్ని కూడా విశాఖకు మార్చుకుంటానన్నారు. వైకాపా ఓటమి చెందడంతో రుషికొండపైన నిర్మాణాలు ప్రభుత్వానివేనంటూ ఇప్పుడు వైకాపా నాయకులు బుకాయిస్తున్నారు. గతంలో రుషికొండపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కాటేజీలు ఉండేవి. ఈ అక్రమ భవన నిర్మాణాలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ప్రభుత్వాన్ని కోరారు.


ఈవీఎంల హ్యాకింగ్‌కు ఎలాన్‌మస్క్‌కు అవకాశమివ్వాలి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌(ఈవీఎం)లను హ్యాకింగ్‌ చేయడానికి టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ని దేశానికి ఆహ్వానించి అవకాశమివ్వాలని ఎన్నికల సంఘా(ఈసీ)న్ని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి కోరారు. ఈవీఎంలను హ్యాకింగ్‌ చేయవచ్చన్న ఎలాన్‌మస్క్‌ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. హ్యాకింగ్‌ నిరూపణకు ఇప్పటికే ఎంతో మందికి ఈసీ అవకాశమిచ్చినా ఎవరూ రుజువు చేయలేకపోయారని ‘ఎక్స్‌’లో సోమవారం ఆమె పేర్కొన్నారు.


రుషికొండపై విలాస భవనాలతో ఖజానాకు గండి కొట్టిన జగన్‌
వర్ల రామయ్య 

ఈనాడు డిజిటల్, అమరావతి: అధికారం తనకే శాశ్వతం అనే భ్రమలో మాజీ సీఎం జగన్‌ రూ.వందల కోట్ల ప్రజాధనంతో విశాఖ రుషికొండపై విలాసవంతమైన రాజమహల్‌ నిర్మించుకున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. రుషికొండకు గుండు కొట్టి.. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని మండిపడ్డారు. ఇంత విలాస భవంతిని ప్రపంచంలో ఏ దేశాధినేతా కట్టించుకోలేదని పేర్కొన్నారు. జగన్‌ పెదవులపై పేదల మాట.. మనసులో సిరుల మూట.. నడిచేది ధనవంతుల బాటని ఆ మాయామహల్‌ని చూస్తే స్పష్టమవుతుందన్నారు.


ఏపీ ఎన్నికల ఫలితాలపై 20, 21 తేదీల్లో కాంగ్రెస్‌ సమీక్ష 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈ నెల 20, 21 తేదీల్లో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ సమీక్షలు నిర్వహించనుంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మొదటి రోజు కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం, నెల్లూరు, ఒంగోలు, నరసారావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, నర్సాపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల ఫలితాలపై సమీక్షించనున్నారు. మరుసటి రోజు అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, విజయవాడ నియోజకవర్గాల ఫలితాలపై చర్చించనున్నట్లు ఆ పార్టీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు.


ప్రజాధనాన్ని వ్యక్తిగత ఆర్భాటాలకు వాడుకున్నారు
జగన్‌పై లంకా దినకర్‌ మండిపాటు

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రజాధనాన్ని మాజీ సీఎం జగన్‌ తన వ్యక్తిగత ఆర్భాటాలకు వినియోగించుకున్నారని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ మండిపడ్డారు. విశాఖపట్నంలో కట్టిన రుషికొండ ప్యాలెస్, అందులో ఉన్న సామగ్రి అంతా ప్రజాధనంతో కొనుగోలు చేసినవేనన్నారు. ప్రధాని మోదీ...నూతన పార్లమెంటు భవనాన్ని ప్రజల, పరిపాలనా వ్యవస్థల దీర్ఘకాల ప్రయోజనాల కోసం నిర్మించారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని