ఆరెస్సెస్‌ విభాగంలా పనిచేస్తోంది: ఎన్‌సీఈఆర్‌టీపై కాంగ్రెస్‌ విమర్శ

జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యపుస్తకాల సవరణపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ విమర్శలు ఎక్కుపెట్టింది. 2014 నుంచి అరెస్సెస్‌ అనుబంధ విభాగంలా ఎన్‌సీఈఆర్‌టీ మారిపోయిందని ఆరోపించింది.

Published : 18 Jun 2024 04:26 IST

దిల్లీ: జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యపుస్తకాల సవరణపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ విమర్శలు ఎక్కుపెట్టింది. 2014 నుంచి అరెస్సెస్‌ అనుబంధ విభాగంలా ఎన్‌సీఈఆర్‌టీ మారిపోయిందని ఆరోపించింది. ఈ పరిణామం రాజ్యాంగంపై దాడేనని అభివర్ణించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సోమవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాలను తయారుచేయడమే ఎన్‌సీఈఆర్‌టీ ప్రధానవిధి తప్ప రాజకీయ కరపత్రాలను రూపొందించడం, ప్రచారం చేయడం కాదన్నారు. 

ఎన్‌సీఈఆర్‌టీ చర్యను చూస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ మతతత్వ విభాగాలుగా మారుస్తున్నట్లు కనిపిస్తోందని కేరళ మంత్రి ఎంబీ రాజేశ్‌ విమర్శించారు. గడచిన 10 ఏళ్లలో భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఇటువంటిపనులనేకం చేసిందని ఆరోపించారు. 

రాజ్యాంగం ప్రకారమే ప్రస్తావన: సక్లానీ

రాజ్యాంగం పేర్కొన్న విధంగానే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోనూ సందర్భానుసారం మనదేశాన్ని భారత్‌ అని ఇండియా అని మార్చుకోవచ్చని సంస్థ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ స్పష్టం చేశారు. ప్రస్తుతం దీనిపై చర్చ అనవసరమని దినేశ్‌ అన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ‘ఇండియా’ పదాన్ని ‘భారత్‌’గా మార్చాలని ఉన్నతస్థాయి కమిటీ గతేడాది సిఫార్సు చేసింది. భారత్‌కు ఆ పేరు 7 వేల సంవత్సరాల క్రితం నుంచే ఉందని భావించిన కమిటీ  ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.


‘ఆ పుస్తకాల నుంచి మా పేర్లు తొలగించండి’

నూతన పాఠ్యపుస్తకాలపై తమ పేర్లను ముద్రించడంపై రాజకీయ నిష్ణాతులైన యోగేంద్ర యాదవ్, సుహాస్‌ పల్షికర్‌ ఎన్‌సీఈఆర్‌టీకి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సంస్థ నుంచి తాము బయటకు వెళ్లినప్పటికీ ఇలా జరగడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే ఆయా పాఠ్యపుస్తకాల నుంచి తమ పేర్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు వారు ఎన్‌సీఈఆర్‌టీకి లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని