ఓట్లు వేయలేదుగా.. సాయం చేయను

భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు ఓట్లు వేయని యాదవులు, ముస్లింలకు తాను ఎటువంటి సహాయం చేయబోనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిహార్‌కు చెందిన జేడీ(యూ) ఎంపీ దేవేశ్‌ చంద్ర ఠాకుర్‌ వివాదంలో చిక్కుకున్నారు.

Published : 18 Jun 2024 04:26 IST

యాదవులు, ముస్లింలను ఉద్దేశించి  జేడీ(యూ) ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

పట్నా: భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు ఓట్లు వేయని యాదవులు, ముస్లింలకు తాను ఎటువంటి సహాయం చేయబోనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిహార్‌కు చెందిన జేడీ(యూ) ఎంపీ దేవేశ్‌ చంద్ర ఠాకుర్‌ వివాదంలో చిక్కుకున్నారు. 71 ఏళ్ల ఠాకుర్‌ బిహార్‌ శాసనమండలి మాజీ ఛైర్మన్‌. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో సీతామడి లోక్‌సభ స్థానం నుంచి 50వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ‘ఎన్డీయే సొంత ఓటర్లు కూడా ఆర్జేడీ వైపు ఆకర్షితులయ్యారు. నాకు సురీలు (మత్స్యకార సామాజిక వర్గం), కల్వార్లు, కుశ్వాహాలు ఓటేయలేద’ంటున్న ఠాకుర్‌ వ్యాఖ్యలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తిలోకి వచ్చింది. ‘‘యాదవ్‌లు, ముస్లింలు నా నుంచి ఎలాంటి సహాయం ఆశించవద్దు. నా వద్దకు వస్తే వారిని గౌరవిస్తా. మర్యాద కోసం టీ ఇస్తా. అంతే కాని వారి సమస్యలను నేను పట్టించుకోను. నాకు ఓట్లు వేయనప్పుడు నేను ఎందుకు పనిచేసి పెట్టాలి’’ అని ఠాకుర్‌ తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తితో చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఎంపీ దేవేశ్‌ చంద్ర ఠాకుర్‌ వ్యాఖ్యలను విపక్ష ఆర్జేడీ తప్పుపట్టింది. ఎంపీగా గెలుపొందిన వ్యక్తి తన నియోజకవర్గంలోని ప్రజలందరికీ ప్రతినిధిగా వ్యవహరించాలని ఆర్జేడీ ప్రధాన అధికార ప్రతినిధి వీరేంద్ర మండిపడ్డారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్‌ ఆనంద్‌ కూడా ఓ ప్రకటనలో ఠాకుర్‌ వైఖరిని ఖండించారు. అయితే, ఎంపీ పేరును నేరుగా ప్రస్తావించలేదు. దేవేశ్‌ చంద్ర ఠాకుర్‌ అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తారని, అయితే, ఎన్నికల్లో ఆశించినంత మెజారిటీ రాకపోవడంతో ఆవేదనతో అలా మాట్లాడి ఉంటారని జేడీ(యూ) అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ తమ పార్టీ ఎంపీని సమర్థించే ప్రయత్నం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని