జులై నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించండి

తెదేపా సభ్యత్వ నమోదు ప్రక్రియను జులై నుంచి ప్రారంభించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు.

Updated : 18 Jun 2024 06:18 IST

పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే
పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు సూచన

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన పల్లా శ్రీనివాసరావును అభినందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా సభ్యత్వ నమోదు ప్రక్రియను జులై నుంచి ప్రారంభించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాలన్నారు. తెదేపా విజయం కోసం కష్టపడి పని చేసిన నాయకుల్ని వీలైనంత త్వరగా నామినేటెడ్‌ పదవుల్లో నియమించి గౌరవించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని యువతను స్వాగతించాలని.. సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లతో ఉండవల్లిలోని వారి నివాసంలో పల్లా శ్రీనివాసరావు సోమవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. తనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లాకు చంద్రబాబు, లోకేశ్‌ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ‘‘యువతతోనే సమాజంలో మార్పు సాధ్యం. వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కష్టపడి పనిచేశారు. అందుకే ఇంతపెద్ద బాధ్యత అప్పగించాం’’ అని చంద్రబాబు తెలిపారు. 

కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా చర్యలు

నెలలో ఏదో ఒకరోజు ప్రతి మంత్రి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీనివాసరావుకు లోకేశ్‌ వివరించారు. ‘‘నాకంటే పెద్ద బాధ్యత మీపై ఉంది. కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు స్తబ్దుగా ఉన్నారు. వారిని క్రియాశీలం చేయాలి. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి’’ అని లోకేశ్‌ సూచించారు. 


23న సీఎం కుప్పం పర్యటన?

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి రానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అందులో భాగంగా ఎస్పీ మణికంఠ చందోలు సోమవారం కుప్పం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని