Rahul Reddy: వైకాపా ఘోర ఓటమి.. ఉద్యోగానికి రాహుల్‌రెడ్డి రాజీనామా

జగన్‌పై వీరాభిమానం ప్రదర్శించిన రాష్ట్ర పట్టణ మౌలిక వసతులు, ఆస్తుల నిర్వహణ సంస్థ (ఏపీయూఐఏఎంఎల్‌) లైజనింగ్, లీగల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి రాహుల్‌రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

Updated : 18 Jun 2024 12:13 IST

జగన్‌ అభిమానిగా ముద్ర
ఎన్నికల ప్రక్రియలో కీలక బాధ్యతలు

ఈనాడు, అమరావతి: జగన్‌పై వీరాభిమానం ప్రదర్శించిన రాష్ట్ర పట్టణ మౌలిక వసతులు, ఆస్తుల నిర్వహణ సంస్థ (ఏపీయూఐఏఎంఎల్‌) లైజనింగ్, లీగల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి రాహుల్‌రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన రాజీనామా చేయడం, దాన్ని అధికారులు ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికలకు ముందు ఈవీఎంల ప్రాథమిక స్థాయి తనిఖీకి సంబంధించిన వెబ్‌ కాస్టింగ్‌ కోసం ఏజెన్సీ ఎంపికకు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) తయారీ బాధ్యతల్లో రాహుల్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. సీఎం జగన్‌కు ఆయన వీరాభిమాని. రాహుల్‌రెడ్డి ఫేస్‌బుక్, లింక్డిన్‌ ఖాతాల్లో జగన్‌పై అభిమానం చాటుకోవడంతోపాటు తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా నేతలు, మీడియాను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. జగన్‌ను తన ‘ఇన్‌స్పిరేషన్‌’గా పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో పెద్దఎత్తున దుమారం చెలరేగింది. ఎన్నికల్లో వైకాపాకు ప్రతికూల ఫలితాలు రావడంతో రాహుల్‌రెడ్డి ఉద్యోగం నుంచి వైదొలిగారు.

సీఈవోగా కొనసాగేందుకు నారాయణరెడ్డి ప్రయత్నాలు

రాష్ట్ర పట్టణ మౌలిక వసతులు, ఆస్తుల నిర్వహణ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో) నారాయణరెడ్డి అదే స్థానంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ ప్రాంత తెదేపా నేతలతో ఉన్న పాత పరిచయాలను ముందుకు తెస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌లో సాధారణ ఉద్యోగిగా సంస్థలో చేరిన నారాయణరెడ్డి.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏకంగా సీఈవో స్థాయికి ఎదిగారు. ఆయన ఎదుగుదలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి సహకరించారు. సీఈవోగా పదోన్నతి పొందాక వైకాపా పెద్దల సిఫార్సులపై అనేక మందికి సంస్థలో అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చారన్న ఫిర్యాదులున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన సర్పంచి ఒకరికి సంస్థలో కీలక ఉద్యోగం ఇప్పించారు. సర్పంచి పదవికి రాజీనామా చేయకుండా, ఉద్యోగిగా కొనసాగడం నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని