పదవుల్లోంచి వైదొలిగినా విచారణ ఎదుర్కోవాల్సిందే

వైకాపా ప్రభుత్వం తితిదేలో దేవుడికి రెండో స్థానమిచ్చి, రాజకీయాలు, అవినీతికి తొలి ప్రాధాన్యమిచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 18 Jun 2024 05:07 IST

తితిదేను భ్రష్టు పట్టించింది జగన్,  సుబ్బారెడ్డి, భూమన, ధర్మారెడ్డి 
తెదేపా నేత నీలాయపాలెం విజయ్‌కుమార్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వం తితిదేలో దేవుడికి రెండో స్థానమిచ్చి, రాజకీయాలు, అవినీతికి తొలి ప్రాధాన్యమిచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్‌రెడ్డి, మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి.. ఈ నలుగురూ కలిసి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వీరు పదవుల్లోంచి వైదొలిగినంత మాత్రాన సుద్ధపూసలైపోరని, స్వామివారి సన్నిధిలో వారుచేసిన అరాచకాలకు, పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో సోమవారం విజయ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. తితిదేలో కీలకంగా వ్యవహరించిన గత పాలకులపై నిర్దిష్ట ఆరోపణలు చేసిన ఆయన.. వీటిపై న్యాయవిచారణ జరపాలని, అప్పటి వరకూ ధర్మారెడ్డిని రిలీవ్‌ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

  • 2023-24లో తితిదే ఇంజినీరింగ్‌ బడ్జెట్‌ రూ.300 కోట్లు. ఛైర్మన్‌గా భూమన బాధ్యతలు చేపట్టాక దీన్ని ఏకంగా రూ.1,233 కోట్లకు పెంచారు. తితిదే బోర్డు ఆమోదం లేకుండానే ఈ పనులను అస్మదీయ గుత్తేదార్లకు కట్టబెట్టారు. ఆ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టలేదు. కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించి, వాటిలోంచి కమీషన్ల రూపంలో రూ.100 కోట్లకు పైగా దండుకున్నారు. 
  • శ్రీవాణి ట్రస్ట్‌పై గతేడాది జూన్‌లో తితిదే ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. అందులో రాష్ట్రంలో 2,273 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో కట్టనున్నట్టు, వాటిలో 1,953 ఆలయాలను దేవాదాయ శాఖ ద్వారా, మిగిలిన 320 గుడులను సమరసత సేవ ట్రస్ట్‌ ద్వారా నిర్మించనున్నట్టు పేర్కొంది. ఒక్కో గుడి నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున వెచ్చించనున్నట్లు తెలిపింది. ఈ లెక్కన సమరసత సేవా ట్రస్ట్‌కు రూ.32 కోట్లు ఇచ్చారు. కానీ ఆ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లో ఒక్కో గుడికి రూ.5 లక్షల చొప్పున తీసుకున్నట్టు, అదీ 2015-18 మధ్య తితిదే ఇచ్చిన గ్రాంటుతో అని ఉంది. 2019-20లో తితిదే నుంచి తీసుకున్న 320 గుడుల వివరాలు సమరసత వెబ్‌సైట్‌లో లేవు. 2020 తర్వాత ఎకౌంట్లు, ఆడిట్, వార్షిక నివేదికలు కూడా కనిపించలేదు. తొలుత ఐఏఎస్‌లు నడిపిన ఈ ట్రస్ట్‌లోకి తర్వాత మామూలు వ్యక్తులు వచ్చి చేరారు. వీటన్నింటినీ నిగ్గు తేల్చాలి.
  • తెదేపా హయాంలో లేని సలహాదారుల విధానాన్ని తితిదేలో ప్రవేశపెట్టిన ధర్మారెడ్డి.. అన్ని విభాగాలనూ తన మనుషులతో నింపేశారు. ఎకౌంట్స్‌లో నరసింహమూర్తి, ఇంజినీరింగ్‌లో కొండలరావు, విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ రామచంద్రారెడ్డి, బర్డ్‌ విభాగంలో గురవారెడ్డి, విజిలెన్స్‌లో ప్రభాకర్, ఫైబర్‌లో సందీప్, ఎస్టేట్‌లో మల్లికార్జున, ఎస్వీబీసీలో మంగ్లీ, విజయ్‌కుమార్, ప్రజా సంబంధాల విభాగంలో సాక్షి నుంచి వచ్చిన నాగేశ్‌.. ఇలా అన్నింట్లో తనకు నచ్చిన వారిని అడ్డగోలుగా నియమించారు. వీరి నియామక ప్రాతిపదికలు, చెల్లించిన జీతభత్యాలపై విచారణ జరపాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని