కేసీఆర్‌పై బురదజల్లేందుకే విచారణ కమిషన్ల ఏర్పాటు

కాంగ్రెస్, భాజపా వేరు కాదని, ఐదేళ్లుగా రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ కలిసే పని చేస్తున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

Updated : 19 Jun 2024 06:28 IST

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్, భాజపా వేరు కాదని, ఐదేళ్లుగా రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ కలిసే పని చేస్తున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వంపై నిందలు వేయాలని, కేసీఆర్‌పై బురద జల్లాలనే స్వార్థంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్‌తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్, భాజపా నేతలు మాట్లాడిన మాటలే మాట్లాడించారు. కేసీఆర్‌ తన లేఖలో అన్ని అంశాలను ప్రజలకు స్పష్టంగా వివరించారు. కమిషన్‌కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండకూడదు. వాస్తవానికి జస్టిస్‌ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదు. కేసీఆర్‌ విషయంలో ఏమీ తేల్చలేమనే భావనతోనే ప్రభుత్వం మీడియాకు లీకులు ఇస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందంతో రూ.6 వేల కోట్ల నష్టం కాదు.. అంతకు మించి లాభం జరిగింది. 17 వేల మిలియన్‌ యూనిట్లు తీసుకొని ఛత్తీస్‌గఢ్‌కు రూ.7 వేల కోట్లు చెల్లిస్తే రూ.6 వేల కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుంది? ఉత్తరాది నుంచి కరెంట్‌ తీసుకోకుండా పరిపాలనలో కేసీఆర్‌ విఫలమైతే.. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలన్నదే వారి కుట్ర. నల్గొండ జిల్లాలో విద్యుత్‌ కేంద్రం ఎందుకు పెట్టొద్దో కోదండరాం సూటిగా సమాధానం చెప్పాలి. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం దొంగలకు మద్దతు పలుకుతున్నారు’’ అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని