తెలంగాణలోనూ తెదేపాకు పూర్వ వైభవం

రానున్న రోజుల్లో తెలంగాణలో సైతం తెదేపాకు పూర్వవైభవం చూస్తామని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఆశాభావం వ్యక్తంచేశారు.

Updated : 19 Jun 2024 06:28 IST

నారా భువనేశ్వరి ఆశాభావం

నారా భువనేశ్వరికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్న  తెలంగాణ తెదేపా నాయకులు

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న రోజుల్లో తెలంగాణలో సైతం తెదేపాకు పూర్వవైభవం చూస్తామని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు ఆమె మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులుతోపాటు పలువురు నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో తెదేపా అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ గెలుపులో భువనేశ్వరి పాత్ర కూడా కీలకమైందని, క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించడంలో ఆమె చేసిన కృషిని కొనియాడారు. చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఇబ్రహీంపట్నం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదాద్రి వరకు ఇటీవల 70 కి.మీ. దూరం పాదయాత్ర చేసిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌తోపాటు మరో 17 మందిని భువనేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపాకు వచ్చిన భారీ మెజార్టీ మాదిరిగానే మున్ముందు తెలంగాణలోనూ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

ఏపీలో కౌరవ సభ స్థానంలో గౌరవ సభ

ఏపీలో ఎన్నికలకు ముందు ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ద్వారా ప్రజలు పడుతున్న బాధలు, ఇబ్బందులు తెలుసుకున్నానని నారా      భువనేశ్వరి అన్నారు. తాను కోరుకున్నట్లుగానే అద్భుతమైన తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పాలన మొదలైందని మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువుదీరుతోందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని