కేరళ నుంచి వాద్రానూ బరిలోకి దింపుతారేమో?

కేరళలోని వయనాడ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయడాన్ని భాజపా మరోసారి తప్పుబట్టింది.

Published : 19 Jun 2024 06:06 IST

వయనాడ్‌లో ప్రియాంక పోటీపై భాజపా ఎద్దేవా

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయడాన్ని భాజపా మరోసారి తప్పుబట్టింది. రాష్ట్రంలోని పాలక్కాడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రాతో పోటీ చేయిస్తారేమోనని ఎద్దేవా చేసింది. వయనాడ్‌ ప్రజలను కాంగ్రెస్‌ నాయకత్వం మోసం చేసిందని మంగళవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్, సీనియర్‌ నేత వి.మురళీధరన్‌ విమర్శించారు. నెహ్రూ-గాంధీ కుటుంబాల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఉందనే విషయం మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో వయనాడ్‌ ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

వయనాడ్‌లో పోటీ చేస్తాం: సీపీఐ

తిరువనంతపురం: వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని సీపీఐ ప్రకటించింది. ఈ సీటును రాహుల్‌ గాంధీ వదులుకోవడంతో ఉప ఎన్నిక రానున్న సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారు. ఆమెపై పోటీకి దిగుతామని, భాజపాకు అవకాశం ఇవ్వకూడదనేదే తమ ఉద్దేశమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్‌ విశ్వం మంగళవారం వెల్లడించారు. తమ అభ్యర్థిని ఎంచుకునే స్వేచ్ఛ కాంగ్రెస్‌కు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని