వయనాడ్‌కు రాహుల్‌ రాజీనామా

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ సభ్యత్వానికి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మంగళవారం రాజీనామా చేశారు. ఎన్నికైన 14 రోజుల్లోగా రాజీనామా చేయాలనే నిబంధనను అనుసరించి వయనాడ్‌ను వదులుకున్నారు.

Published : 19 Jun 2024 06:07 IST

దిల్లీ: కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ సభ్యత్వానికి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మంగళవారం రాజీనామా చేశారు. ఎన్నికైన 14 రోజుల్లోగా రాజీనామా చేయాలనే నిబంధనను అనుసరించి వయనాడ్‌ను వదులుకున్నారు. రాయ్‌బరేలీ ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. రాహుల్‌ రాజీనామాను  ఆమోదించినట్లు లోక్‌సభ సచివాలయం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో లోక్‌సభలో కాంగ్రెస్‌ బలం 99కి తగ్గింది. వాస్తవానికి కాంగ్రెస్‌ 99 సీట్లే గెలుచుకుంది. కానీ మహారాష్ట్ర నుంచి ఎన్నికైన రెబల్‌ అభ్యర్థి కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వడంతో పార్టీ బలం 100కు చేరుకుంది. రాహుల్‌ రాజీనామాతో మళ్లీ 99కి తగ్గింది. 

ఎన్డీయే నేతలు మాతో టచ్‌లో ఉన్నారు 

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని, అందులోని కొందరు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ‘ఆ కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశముంది. అది బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు’ అని మంగళవారం దిల్లీలో వ్యాఖ్యానించారు. ‘మీరు (మోదీని ఉద్దేశించి) గతంలో విద్వేషాన్ని వ్యాప్తి చేసి.. దాని ఫలితాలను పొంది ఉండొచ్చు.  ఈసారి ఆ ఆలోచనను ప్రజలు తిరస్కరించారు. ఎటువంటి వివక్ష లేని పరిస్థితులుంటే..‘ఇండియా’ కూటమి నిస్సందేహంగా మెజారిటీ దక్కించుకుని ఉండేది. మా చేతులు కట్టేసిన పరిస్థితుల్లో మేం పోరాడాం. అలాంటి సమయాల్లో ఏం చేయాలో ప్రజలకు కచ్చితంగా తెలుసు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని