గాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై కేకు కట్‌ చేశారు.

Published : 20 Jun 2024 04:43 IST

గాంధీభవన్‌లో కేకు కోసి బాలికకు తినిపిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
చిత్రంలో సిరిసిల్ల రాజయ్య, మెట్టు సాయికుమార్, శివసేనారెడ్డి తదితరులు
 

హైదరాబాద్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కోమటిరెడ్డి, శివసేనారెడ్డిలతోపాటు మూడు వందల మంది రక్తదానం చేశారు. పీసీసీ ఫిషర్‌మెన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భట్టి, కోమటిరెడ్డిలు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ భారీ కటౌట్‌ ఏర్పాటు చేసి బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, శివసేనారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం రాహుల్‌గాంధీ భారత్‌ జోడో, భారత్‌ న్యాయ్‌ యాత్రలు చేపట్టి ప్రజలను ఐక్యం చేసేందుకు కృషి చేశారన్నారు. రాహుల్‌ వ్యక్తి కాదు ఒక శక్తి అని, యావత్‌ భారత దేశానికి ఆయన భవిష్యత్‌ అని పేర్కొన్నారు. సీనియర్‌ ఉపాధ్యక్షులు కుమార్‌రావు, జి.నిరంజన్, కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు కోదండరెడ్డి, అన్వేశ్‌రెడ్డి, పీసీసీ మేధావుల విభాగం ఛైర్మన్‌ శ్యాంమోహన్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌ సామ రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పాల్గొని కేకు కట్‌ చేశారు.

తెలంగాణ భవన్‌లో..

ఈనాడు, దిల్లీ: దిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు రాహుల్‌ గాంధీ జన్మదినోత్సవం నిర్వహించారు. కేక్‌ కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పార్టీ నాయకుడు లక్ష్మణ్‌యాదవ్‌ పాల్గొన్నారు. వీరంతా ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్‌గాంధీని వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


త్యాగం, పోరాటం.. రాహుల్‌గాంధీ తత్వం: ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి

త్యాగం, పోరాటం.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తత్వమని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ రేవంత్‌రెడ్డి పోస్ట్‌చేశారు. ‘వెనకబడిన వర్గాల వారికి అండగా ఉండాలనేది ఆయన దృక్పథం. త్యాగం వారసత్వం, పోరాటం ఆయన తత్వం. రాహుల్‌ తెలివైన వారు.. రేపటి భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్‌గాంధీతో కలిసి దిగిన చిత్రాన్ని తన పోస్టుకు జత చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని