సంక్షిప్తవార్తలు (6)

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కల్యాణ్‌కు పురపాలకశాఖ మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 20 Jun 2024 06:43 IST

పవన్‌కల్యాణ్‌తో నారాయణ భేటీ

ఈనాడు డిజిటల్, అమరావతి: ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కల్యాణ్‌కు పురపాలకశాఖ మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం విజయవాడలో పవన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అమరావతి ప్రాంతంలో సీఎం గురువారం పర్యటించనున్నారు. వైకాపా పాలకులు కూల్చిన ప్రజావేదిక నుంచే ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. సీఆర్డీఏ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడతారు’’ అని నారాయణ తెలిపారు. సీఆర్డీయే కార్యాలయాన్ని జీ ప్లస్‌ 7 విధానంలో నిర్మించనున్నట్టు వెల్లడించారు.


జగన్‌ను కలిసిన ముఖ్య నేతలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో పరాజయం తర్వాత వివిధ జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్‌ సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు, పార్టీ నాయకులు జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను ఆయనతో పంచుకున్నారు.


పార్టీ పేలవ ప్రదర్శనపై కాంగ్రెస్‌ 6 కమిటీలు

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ఆరు కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లతో పాటు మధ్యప్రదేశ్, దిల్లీ, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో పార్టీ రాణించకపోవడానికి గల కారణాలను ఆయా కమిటీలు అన్వేషిస్తాయి. తెలంగాణ కమిటీకి పి.జె.కురియన్‌ నేతృత్వం వహిస్తారు. రకిబుల్‌ హుస్సేన్, పర్గత్‌ సింగ్‌ సభ్యులుగా ఉంటారు.


వారితో ఎప్పటికీ  కలిసి వెళ్లం: ఉద్ధవ్‌ 

ముంబయి: తమ పార్టీని అంతం చేయాలనుకున్నవారితో ఎప్పటికీ తిరిగి కలిసే ప్రసక్తి ఉండదని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం తెలిపారు. భాజపాతో శివసేన(యూబీటీ) వర్గం మళ్లీ కలుస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఉద్ధవ్‌ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శివసేన 58వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో  మాట్లాడిన ఉద్ధవ్‌.. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, ఆ స్థానంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని చెప్పారు.  


కేంద్ర విద్యా మంత్రి రాజీనామా చేయాలి: ఆప్‌

దిల్లీ: నీట్‌లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) డిమాండు చేసింది. విద్యా వ్యవస్థలో అవినీతి అంటే దేశాన్ని మోసం చేయడమేనని వ్యాఖ్యానించింది. ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సందీప్‌ పాఠక్‌ బుధవారం దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయని గత కొన్ని రోజులుగా వెలుగులోకి వస్తోంది. ఈ పరీక్ష కోసం లక్షల మంది విద్యార్థులు ఎంతో ముందుగా సిద్ధం అవుతుంటారు. ఈ ఏడాది లక్ష వైద్య సీట్ల కోసం 24 లక్షల మంది పోటీ పడ్డారు. వారి తల్లిదండ్రులూ ఇందులో ఎంతో శ్రద్ధ పెడతారు. ప్రధాని మోదీ దీనిపై స్పందించాలి. ప్రశ్న పత్రాల లీకేజీని భాజపా వ్యవస్థీకృతం చేసింది. దీనికి మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. అక్కడ 2015 నుంచి ఇలాగే జరుగుతోంది. లీకేజీ లేకుండా ఇంతవరకూ ఆ రాష్ట్రంలో ఒక్క పరీక్షనూ నిర్వహించలేకపోయారు’ అని పాఠక్‌ ధ్వజమెత్తారు. 


నీట్‌పై రేపు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిరసనలు

దిల్లీ: నీట్‌లో అవకతవకలకు నిరసనగా శుక్రవారం అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది. రాష్ట్రాల రాజధానుల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని సూచిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు, శాసనసభాపక్ష నేతలకు, రాష్ట్ర ఇన్‌ఛార్జులకు, ప్రధాన కార్యదర్శులకు, ఇతర అగ్రనేతలకు బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ లేఖలు పంపారు. నీట్‌ అవకతవకలపై కేంద్రం స్పందించనందుకు నిరసనగా భారీగా ఆందోళనలు చేపట్టాలని అందులో సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని