ఉన్నత విద్యాశాఖలో కన్సల్టెంట్‌గా కొనసాగుతున్న ఐప్యాక్‌ వ్యక్తి

గత ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖలో కన్సల్టెంట్‌గా నియమితులైన కార్తీక్‌ అనే ఉద్యోగికి రూ.1.25 లక్షల వేతనం చెల్లించాలంటూ ఉన్నత విద్యామండలికి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Published : 20 Jun 2024 04:47 IST

నెలకు 1.25 లక్షల జీతం చెల్లించాలంటూ ఆదేశాలు
ప్రభుత్వం మారినా పదవుల్లో వైకాపా సానుభూతిపరులు

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖలో కన్సల్టెంట్‌గా నియమితులైన కార్తీక్‌ అనే ఉద్యోగికి రూ.1.25 లక్షల వేతనం చెల్లించాలంటూ ఉన్నత విద్యామండలికి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. వైకాపా ప్రభుత్వం మారినా ఆయన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నుంచి కాకుండా ఉన్నత విద్యామండలి నుంచి జీతం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఉన్నత విద్యాశాఖలో కన్సల్టెంట్‌గా పని చేసే కార్తీక్‌.. గతంలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఐప్యాక్‌లో చేరారు. అక్కడ కొద్ది రోజులు పని చేసిన తర్వాత తిరిగి వచ్చేశారు. అప్పటి ప్రభుత్వం ఆయనను ఉన్నత విద్యాశాఖలో రూ.1.25 లక్షల జీతానికి మళ్లీ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ప్రస్తుతం ఆయనకు జీతం చెల్లించేందుకు ఇబ్బందులు వస్తుండటంతో మే నుంచి ప్రతి నెల జీతాన్ని ఉన్నత విద్యామండలి నుంచి చెల్లించాలని తాజాగా ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ మొత్తాన్ని తర్వాత రీయింబర్స్‌ చేస్తామని పేర్కొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ఉద్యోగ ప్రకటన, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఉద్యోగంలోకి కొత్తగా ఎవ్వరినీ తీసుకోకూడదు. కానీ, ఉన్నతాధికారితో ఉన్న పరిచయాల కారణంగా ఐప్యాక్‌లో పని చేసి వచ్చినప్పటికీ మళ్లీ ఉద్యోగం ఇచ్చారు. గతంలో డిగ్రీ కళాశాలల అనుబంధ గుర్తింపు, ఆన్‌లైన్‌ ప్రవేశాలు, ఎయిడెడ్‌ కళాశాల విలీనం ప్రక్రియలో కార్తీక్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారినా వైకాపా సానుభూతిపరులను పదవుల్లో కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని