వెంటనే బీసీ కులగణన చేపట్టాలి

దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనేక సందర్భాల్లో హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలువురు బీసీ సంఘాల నేతలు ఆక్షేపించారు.

Published : 20 Jun 2024 04:49 IST

రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
బీసీ విద్యావంతుల వేదిక డిమాండ్‌

బీసీ విద్యావంతుల వేదికలో ఐక్యత చాటుతున్న ప్రొఫెసర్‌ తిరుమల, ప్రొఫెసర్‌ సింహాద్రి, చిరంజీవులు, బీఎస్‌ రాములు,
శ్రీనివాస్‌ గౌడ్, జస్టిస్‌ ఈశ్వరయ్య, పీజీఆర్‌ నారగోని, సత్యనారాయణ, గణేశ్‌ చారి, దాసు సురేష్‌ తదితరులు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనేక సందర్భాల్లో హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలువురు బీసీ సంఘాల నేతలు ఆక్షేపించారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే స్వతంత్ర కమిషన్‌ ఏర్పాటుచేసి సమగ్ర కులగణన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మౌనంగా ఉండటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సమగ్ర ‘కులగణనకు సవాళ్లు- కమిషన్‌ ఏర్పాటు- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు’ అనే అంశంపై మేధో మథన సదస్సు జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్, హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చినందుకే దేశవ్యాప్తంగా ఓబీసీలు కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డారన్నారు. వెంటనే బిహార్‌ తరహాలో సమగ్ర కులగణన చేపట్టాలని, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు. అంతకుముందు బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, రిజర్వేషన్ల వాటాలలో లోటుపాట్లను విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.చిరంజీవులు వివరించారు.జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ, బీసీ కుల గణన డిమాండ్‌తో వచ్చే వారం నుంచి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని, చివరిగా బస్సు యాత్ర చేపట్టి లక్షల మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తామన్నారు.కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు శ్యామ్‌ కురుమ, మహిళా సంఘం అధ్యక్షురాలు మణి మంజరి, ప్రొఫెసర్‌ ఐ.తిరుమల, ప్రొఫెసర్‌ సింహాద్రి, బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ బీఎస్‌ రాములు, బీసీ నేత పీజీఆర్‌ నారగోని, విశ్రాంత ఎస్పీ సత్యనారాయణ, తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ గణేశ్‌ చారి, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని