జగన్‌కు వ్యతిరేకంగా జనమంతా ఏకం

ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్‌ను గద్దె దించాలని బలంగా అనుకున్నారని, అందుకే వైకాపా ఘోర పరాజయం చవిచూసిందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు.

Published : 20 Jun 2024 05:56 IST

అందుకే వైకాపా ఘోర పరాభవం
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఈనాడు డిజిటల్, అమరావతి: ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్‌ను గద్దె దించాలని బలంగా అనుకున్నారని, అందుకే వైకాపా ఘోర పరాజయం చవిచూసిందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే విచిత్రమైనవని అభివర్ణించారు. విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ‘మార్పు కావాల్సిందేనని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎన్నికల ముందు సర్వే చేస్తే మాకు సుమారు 6-7 శాతం ఓటు షేర్‌ ఉంది. నేను రాష్ట్రవ్యాప్తంగా 64 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించా. అయినా మేం ఆశించిన మేర ఓట్లు సాధించలేకపోయాం. ఓటు వృథా కాకూడదన్న ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఓటేయలేదు. ఏదేమైనా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగింది’ అని చెప్పారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్‌  కీలకపాత్ర పోషిస్తుందనే నమ్మకం ఉందన్నారు.  

కడప ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు

‘కడప లోక్‌సభ పరిధిలో నేను కేవలం 14 రోజులు మాత్రమే ప్రచారం చేయగలిగా. అక్కడి ప్రజలు ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా ఓటేస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని, కేసులు బనాయిస్తారని, దాడులకు తెగబడతారనే భయంలో ఉన్నారు. దీనికి అధికార పక్షానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేనే కారణం. ఓటుకు రూ.3,500 పంపిణీ చేశారు’ అని వ్యాఖ్యానించారు.

‘రివర్స్‌ టెండరింగ్‌’తో పోలవరం వ్యయాన్ని పెంచేసిన జగన్‌

‘పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో చెప్పిన మోదీ ఆ మాటను పూర్తిగా విస్మరించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మద్దతిస్తున్నారు కాబట్టే కేంద్రంలో ఎన్డీయే సర్కారు కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా పట్టుబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని డిమాండు చేస్తున్నాం. పోలవరం పూర్తి చేయడానికీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అప్పటి సీఎం జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచారు. కానీ పనుల్లో మాత్రం పురోగతి లేదు’ అని పేర్కొన్నారు. ఈవీఎంల వినియోగంపై మేధావులే చర్చించి నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని