నాసిరకం మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ చేయించండి

గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం విక్రయాలు, ఎక్సైజ్, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలని, ఇసుక దోపిడీపైనా రాష్ట్రప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.

Published : 21 Jun 2024 04:32 IST

ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణకు ఆదేశించండి
సీఎం చంద్రబాబుకు భాజపా ఎంపీ పురందేశ్వరి వినతిపత్రం

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం విక్రయాలు, ఎక్సైజ్, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలని, ఇసుక దోపిడీపైనా రాష్ట్రప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు గురువారం వినతిపత్రాలు అందజేశారు. నాణ్యత లేని మద్యం కారణంగా గత ఐదేళ్లలో పెద్ద సంఖ్యలో మరణించారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల్లో మరణించిన వారిని మించి నాసిరకం మద్యం తాగి చనిపోయారని వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం రూ.33వేల కోట్ల మద్యం అమ్మకాలు చూపిస్తున్నారని.. కొనుగోలు, అమ్మకంలో తేడా 400% నుంచి 500% శాతం వరకు ఉంటుందని.. ఇదంతా వైకాపా నేతల జేబుల్లోకి చేరిందని పేర్కొన్నారు.

35 లక్షల భవన నిర్మాణ కార్మికుల జీవితాలపై ప్రభావం

వైకాపా హయాంలో ఇసుక దోపిడీ కారణంగా.. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలు దెబ్బతిన్నాయని పురందేశ్వరి పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నిబంధనలు పాటించకుండా ఇసుక తవ్వేశారని, నదీగర్భంలో రహదారులు వేసి తరలించారని వివరించారు. ఇసుక తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిందని.. వైకాపా నేతలు భారీ ఎత్తున దోచుకున్నారని తెలిపారు. కొత్త ఇసుక విధానంలో భాగంగా ఆన్‌లైన్‌ బిల్లింగ్‌ అమలుచేయాలని, ఎన్జీటీ నిబంధనల మేరకు తవ్వకాలు చేయాలని కోరారు. ఐదేళ్ల వైకాపా సర్కారు ఇసుక తవ్వకాలపై విచారణ చేయించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని