మాదిగల మద్దతుతోనే భాజపా ఓట్ల శాతం పెరిగింది: మందకృష్ణ మాదిగ

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) ఏర్పాటై 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా జులై 7న వరంగల్‌లో మాదిగ ఆత్మగౌరవ కవాతు నిర్వహిస్తున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.

Published : 21 Jun 2024 05:11 IST

ఎమ్మార్పీఎస్‌కు 30 ఏళ్లు
జులై 7న వరంగల్‌లో కవాతు

సమావేశంలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ. చిత్రంలో గోవిందు నరేశ్, టీవీ నర్సింహ తదితరులు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) ఏర్పాటై 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా జులై 7న వరంగల్‌లో మాదిగ ఆత్మగౌరవ కవాతు నిర్వహిస్తున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. గురువారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ..ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్‌ ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లో భాజపా, దాని మిత్రపక్షాలను బలపరిచిందని తెలిపారు. మాదిగలు భాజపాను బలపర్చడానికి కారణం ప్రధాని మోదీ పట్ల ఉన్న విశ్వాసమేనన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఓట్ల పరంగా బలహీనపడిన భాజపా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడిందని అందులో ఎమ్మార్పీఎస్‌ పాత్ర ఎంతో ఉందన్నారు. తెలంగాణలో 7శాతం ఉన్న భాజపా ఓటు బ్యాంకు ఎమ్మార్పీఎస్‌ మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగిందని, పార్లమెంటు ఎన్నికల్లో 35 శాతానికి చేరిందని గుర్తుచేశారు. మాదిగలు భాజపాకు దగ్గర కావడానికి కారణం రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్థానాల్లో మాదిగలకు ఒక్క సీటైనా ఇవ్వకపోవడమేనన్నారు. రిజర్వేషన్లు పెంచకుంటే తాము స్థానిక సంస్థల ఎన్నికలకు అంగీకరించబోమని, బీసీ సంఘాలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌ మాదిగ, జాతీయ కార్యదర్శి విజయ్‌ మాదిగ, ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్‌ మాదిగ, నాయకులు టీవీ నర్సింహమాదిగ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు