రాజముద్రలో కాకతీయ కళాతోరణం తీసేయొద్దు

వరంగల్‌ బల్దియాకు సంబంధించి బడ్జెట్‌ ఆమోదానికి గురువారం వరంగల్‌ మహానగరపాలక సంస్థ మేయర్‌ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది.

Updated : 21 Jun 2024 05:45 IST

వరంగల్‌ కార్పొరేషన్‌లో తీర్మానానికి భారాస పట్టు

కౌన్సిల్‌ సమావేశంలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న భారాస కార్పొరేటర్లు.. చిత్రంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య

వరంగల్‌ కార్పొరేషన్, న్యూస్‌టుడే: వరంగల్‌ బల్దియాకు సంబంధించి బడ్జెట్‌ ఆమోదానికి గురువారం వరంగల్‌ మహానగరపాలక సంస్థ మేయర్‌ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తీసేయొద్దని, అందుకు కౌన్సిల్‌లో తీర్మానం చేయాలంటూ సమావేశానికి హాజరైన భారాస ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, కార్పొరేటర్లు పట్టుబట్టారు. భారాస, కాంగ్రెస్‌ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. సమావేశం ప్రారంభమవగానే.. చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించొద్దంటూ ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపించాలని భారాస ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పట్టుబట్టారు. అందుకు సంబంధించి ఉప మేయర్‌ రిజ్వానా షమీమ్‌ అందించిన లేఖను మేయర్‌ పట్టించుకోలేదంటూ ఆందోళనకు దిగారు. ఎలాంటి చర్చ లేకుండానే రూ.650.12 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించినట్లు ప్రకటించారు. మేయర్‌ ఏకపక్షంగా తీర్మానం చేశారని సమావేశ మందిరం బయట భారాస ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు బైఠాయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని