‘నీట్‌ పరీక్షా పే చర్చా’ ఎప్పుడు నిర్వహిస్తారు: ఖర్గే

లీకులు, మోసాలు లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది

Updated : 21 Jun 2024 06:34 IST

దిల్లీ: లీకులు, మోసాలు లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ప్రతి ఏడాదీ ప్రధాని విద్యార్థుల కోసం పరీక్షా పే చర్చ అంటూ ఓ తమాషా నిర్వహిస్తున్నారని మండిపడింది. మోదీ ప్రభుత్వాన్ని పేపర్‌ లీక్‌ ప్రభుత్వంగా అభివర్ణించింది. ఈ పేపర్‌ లీకులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించింది. నీట్‌లో అవకతవకలపై ప్రధాని నీట్‌ పరీక్షా పే చర్చ ఎప్పుడు నిర్వహిస్తారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.


విద్యా వ్యవస్థ ధ్వంసమైంది

-రాహుల్‌ 

‘దేశ విద్యా వ్యవస్థపై కొందరి నియంత్రణ కారణంగానే పేపర్లు లీకవుతున్నాయి. దీనికి మోదీ అవకాశమిచ్చారు. వైస్‌ ఛాన్సలర్ల నియామకాలు ప్రతిభ ఆధారంగా జరగడం లేదు. స్వతంత్ర విద్యా వ్యవస్థ ధ్వంసమైంది. ఇలాంటి పరిణామాలకు కారకులైన వారికి శిక్ష పడాలి. ఈ పరిస్థితి మారనంత కాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇది దేశ వ్యతిరేక చర్య. ఈ అవకతవకలను మేం పార్లమెంటులో లేవనెత్తుతాం’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ వెల్లడించారు. ఎన్‌టీఏకు కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. తాము ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నామో ప్రజలకు స్పష్టంగా అర్థమైందని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని మోదీ.. పేపర్ల లీకేజీని ఆపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 

  • నీట్‌ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి గురువారం రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. మళ్లీ పరీక్ష నిర్వహించాలనే తమ డిమాండుకు మద్దతివ్వాలని వారు కోరారు. 
  • ఎన్‌టీఏ తీరును కేరళ ముఖ్యమంత్రి విజయన్, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాకేత్‌ గోఖలే, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా తప్పుబట్టారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండు చేశారు.
  • కేంద్ర విద్యా మంత్రి రాజీనామా చేయాలని, ఎన్‌టీఏను రద్దు చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండు చేశారు. యూజీసీ నెట్, నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

లీకేజీ వెనుక తేజస్వీ సహాయకుడు

-భాజపా

‘నీట్‌-యూజీ ప్రవేశ పరీక్ష-2024’లో అవకతవకలు, పేపర్‌ లీకేజీ వెనుక ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సహాయకుడి ప్రమేయం ఉందని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హా ఆరోపించారు. రోడ్డు నిర్మాణశాఖకు చెందిన ఉద్యోగికి సహాయకుడు ఫోన్‌ చేసి.. నిందితుడి కోసం ఒక గది బుక్‌ చేయించినట్లు సిన్హా పేర్కొన్నారు. పరీక్ష జరగడానికి నాలుగు రోజుల ముందు ఈ కాల్‌ వెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండు చేశారు. పట్నాలోని గెస్ట్‌హౌస్‌లో గది బుక్‌ చేసిన ఆర్‌సీడీ ఉద్యోగితోపాటు మరో ఇద్దరిని సస్పెండు చేసినట్లు సిన్హా మీడియాకు చెప్పారు. దీనిపై బిహార్‌ ఎన్‌హెచ్‌ఏఐ స్పందించింది. తమకు పట్నాలో అసలు గెస్ట్‌హౌస్‌ సౌకర్యమే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు ఆర్జేడీ అదే తరహా ఆరోపణలు చేసింది. ఇతర నిందితులతో భాజపా, జేడీయూకు సంబంధాలు ఉన్నాయని వెల్లడించింది. 

నీట్‌పై రాహుల్‌ గాంధీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని భాజపా ఆరోపించింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కేంద్రం ఈ అంశాన్ని సున్నితంగా చూస్తోందని పేర్కొంది. రాహుల్‌ వ్యాఖ్యలపై భాజపా అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది స్పందించారు. పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రధాని మానసికంగా దెబ్బతిన్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారని, ఇది సరికాదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని