ఆకర్షణగా పవన్‌కల్యాణ్‌

శాసనసభలోకి తొలిసారి ప్రవేశించిన పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే సినీహీరో నందమూరి బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి సభకు వచ్చారు. పవన్‌కల్యాణ్‌ శాసనసభకు రావడంతో శుక్రవారం అభిమాన సందడి కనిపించింది.

Published : 22 Jun 2024 04:09 IST

బాలకృష్ణకు జత కలిసిన మరో హీరో
పవన్‌తో ఫొటోలు, షేక్‌హ్యాండ్‌ కోసం పోటీ

సభలో ఉపముఖ్యమంత్రి పవన్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆత్మీయ పలకరింపు

ఈనాడు, అమరావతి: శాసనసభలోకి తొలిసారి ప్రవేశించిన పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే సినీహీరో నందమూరి బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి సభకు వచ్చారు. పవన్‌కల్యాణ్‌ శాసనసభకు రావడంతో శుక్రవారం అభిమాన సందడి కనిపించింది. పవన్‌కు కేటాయించిన గది వద్ద పెద్దసంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆయన సభలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఆయనను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు చాలామంది ఉవ్విళ్లూరారు. వారిని నియంత్రించడానికి శాసనసభ సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. సమావేశాలు ముగిసిన తర్వాత మొదటి కమిటీ హాలులో పవన్‌కల్యాణ్‌ ఇతర మంత్రులతో కలిసి అధికారులతో రాష్ట్రంలో డయేరియా పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా అనేకమంది అక్కడికి వచ్చి ఎదురుచూస్తూ ఉన్నారు. శాసనసభలో పనిచేసే అనేకమంది మహిళా సిబ్బంది, ఇతరులు పవన్‌కల్యాణ్‌ను చూడాలని.. వీలైతే ఫొటో దిగాలని ఉత్సుకత చూపించారు. శుక్రవారం పవన్‌కల్యాణ్‌ శాసనసభ్యునిగా ప్రమాణం చేసిన తర్వాత ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్యచౌదరిని కలిసి ధన్యవాదాలు చెప్పగా ఆయన అభినందించారు. ఆ సమయంలో అక్కడున్న దఫేదార్‌ సైతం పవన్‌కల్యాణ్‌కు చేతులు అందించి అభినందనలు తెలియజేశారు. టీ విరామ సమయంలో కొందరు శాసనసభ సిబ్బంది ఆయనతో ఫొటోలు తీసుకున్నారు. కూటమి ఎమ్మెల్యేలు సైతం కొందరు ఫొటోలు తీయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని