పదేళ్ల ప్రగతిపై బురద చల్లడం మానండి

ఇప్పటికైనా పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపైన బురద జల్లడం మానుకొని, అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు.

Published : 22 Jun 2024 04:40 IST

‘ది ఎకనామిస్ట్‌’ కథనాన్ని ఉటంకించిన కేటీఆర్‌
అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌కు సూచన

ఈనాడు, హైదరాబాద్‌: ఇప్పటికైనా పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపైన బురద జల్లడం మానుకొని, అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ ప్రగతి, విజయయాత్రపై ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్‌ ‘ది ఎకనామిస్ట్‌’లో ప్రచురితమైన కథనాన్ని ఆయన ఉటంకించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ పదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించి.. మరిన్ని కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక ‘సక్సెస్‌ఫుల్‌ మోడల్‌’ అయ్యిందంటూ ఆ మ్యాగజైన్‌ కథనంలో ప్రచురించారని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన విజయాల గణాంకాలను ఆ పత్రిక ఉదహరించిందని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఒక అభివృద్ధి మోడల్‌గా తయారైంది. తెలంగాణ ఏర్పడిన నాటికి స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 7.8 గిగావాట్లు కాగా.. అది గత పదేళ్లలో 19.3 గిగావాట్లకు పెరిగింది. ఐటీ ఎగుమతులు 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. తెలంగాణ ఐటీ దిగుమతులు ప్రస్తుతం 29 బిలియన్‌ డాలర్లు. ఐటీ ఉద్యోగాలు దాదాపు మూడు రెట్లు పెరిగి 9 లక్షలకు చేరుకున్నాయి. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం పదేళ్లలో 4.1% నుంచి 4.9% శాతానికి పెరిగింది. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు తెలంగాణ పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని గొప్పగా కొనియాడుతున్న నేపథ్యంలో.. ఇకనైనా కాంగ్రెస్‌ పాలకులు భారాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు నిలిపివేస్తారని భావిస్తున్నా. భారాస ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా’’ అని కేటీఆర్‌ తెలిపారు

.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని