ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గనుల వేలాన్ని వ్యతిరేకించి ఇప్పుడు మౌనమేల రేవంత్‌?: కేటీఆర్‌

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉండి ఎందుకు వ్యతిరేకించడం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated : 22 Jun 2024 05:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉండి ఎందుకు వ్యతిరేకించడం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేంద్రం నేరుగా కేటాయించాలని అప్పట్లో మాట్లాడిన రేవంత్‌ ఇప్పుడు ఆశ్చర్యకరంగా మౌనం వహించడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సింగరేణి గనుల వేలం కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టిని పంపడం ద్వారా వేలం విషయంలో మారిన తన వైఖరిని రేవంత్‌ ప్రజలకు వివరించాలి. దీని వెనుక ఉన్న ఒత్తిళ్లు ఏమిటో వారికి తెలియజెప్పాలి. తెలంగాణ గనుల వేలం ద్వారా అంతిమంగా మొత్తం సింగరేణి సంస్థ ప్రైవేట్‌పరం అవుతుంది. పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తుంది. సింగరేణి గొంతు కోసేలా నిర్వహించిన గనుల వేలం కార్యక్రమంలో.. భట్టితో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎలాంటి ఆందోళన లేకుండా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. దీన్నిబట్టి వారికి రాష్ట్రంపై ఏపాటి ప్రేమ ఉందో తెలుస్తోంది. వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి.. పూలబొకేలతో నిస్సిగ్గుగా ఫొటోలకు పోజులిచ్చారు. సింగరేణి సంస్థకు మరణశాసనం రాసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు భారాస ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఫిరాయింపుల డ్రామాకి రేవంత్‌ తెరలేపారు. ఈ గనుల వేలం సందర్భాన్ని తెలంగాణ చరిత్ర క్షమించదు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని