కాంగ్రెస్, భాజపాలకు తెలంగాణ సోయి లేదు

కాంగ్రెస్, భాజపా నాయకులకు కేసీఆర్‌పై ఎదురుదాడి చేయడం తప్ప తెలంగాణ సోయి లేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

Published : 22 Jun 2024 04:50 IST

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు

ఆచార్య జయశంకర్‌కు నివాళి అర్పించి విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, చిత్రంలో టీఎన్జీవోస్‌ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, మహమూద్‌అలీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తదితరులు 

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్, భాజపా నాయకులకు కేసీఆర్‌పై ఎదురుదాడి చేయడం తప్ప తెలంగాణ సోయి లేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్‌కు నివాళి అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించకుండా కేసీఆర్‌ పదేళ్లు అడ్డుపడ్డారు. అసెంబ్లీలో, బయట భారాస పోరాడిన తర్వాతనే కాంగ్రెస్‌ ప్రభుత్వం తోకముడిచింది. ఇప్పుడు సింగరేణి బ్లాక్‌ల వేలంపై కూడా భారాస ప్రశ్నించిన తర్వాతే కాంగ్రెస్‌ తన వైఖరి మార్చుకుంది. అయినా కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తూనే ఉంది. నిజానికి కేసీఆర్‌ తెలంగాణ హక్కులపై ఎప్పుడూ వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్, భాజపాలు కూడబలుక్కుని అవాస్తవాలు మాట్లాడుతున్నాయి. సింగరేణి కార్మికులు ఆ రెండు పార్టీల తీరును అర్థం చేసుకోవాలి. పోచారం భారాసను వీడటం దురదృష్టకరం. ఆయనకు కేసీఆర్‌ ఏం తక్కువ చేశారు?’’ అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.

యూపీఏ హయాంలోనే గనుల సవరణ బిల్లు: వినోద్‌కుమార్‌

గనుల సవరణ బిల్లుకు 2015లో పార్లమెంటులో భారాస మద్దతిచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అసలు ఆ బిల్లును 2011లో ప్రవేశపెట్టిందే అప్పటి మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమని అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో స్టాండింగ్‌ కమిటీ సూచనల మేరకు తెచ్చిన బిల్లునే భాజపా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకొచ్చిందన్నారు. భట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రేవంత్, మోదీ కలిసి సింగరేణిని అమ్ముతారని ఎప్పుడో చెప్పానన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లి సింగరేణిని బతికించాలి అని వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని