విపక్ష నేతలను కేసులతో వేధిస్తున్నారు

నీట్‌ ప్రశ్నపత్రం అంగట్లో సరకులా మారిపోయిందని, 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు.

Published : 22 Jun 2024 04:51 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీశ్‌రావు మండిపాటు
నీట్‌ ప్రశ్నపత్రం అంగట్లో సరకులా మారిందని ఆందోళన

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు

పటాన్‌చెరు అర్బన్, న్యూస్‌టుడే: నీట్‌ ప్రశ్నపత్రం అంగట్లో సరకులా మారిపోయిందని, 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో పటాన్‌చెరులో మధుసూదన్‌రెడ్డి నివాసానికి శుక్రవారం వచ్చి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ... ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నాయి. అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. మా కదలికలను ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా తెలుసుకుంటోంది. ఎవరైనా ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరితే అదే నిమిషం సభ్యత్వం రద్దు చేయాలని రాహుల్‌గాంధీ మ్యానిఫెస్టోలో పెట్టారు కదా... మరి భారాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఎందుకు యత్నిస్తున్నారు? ప్రజలిచ్చిన అవకాశంతో వారికి మేలు చేయాలి. హామీలను అమలు చేయాలి. ఇవన్నీ మరిచి ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారు. మహిపాల్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు చాలా గట్టిగా ఉన్నారు. గురువారం ఈడీ అధికారులకు సహకరించారు. ఫోన్లు, లాకర్లు, బీరువాలు, దస్త్రాలు అందుబాటులో ఉంచారు. ఐటీ రిటర్నులతో సహా అన్నీ స్పష్టంగా ఉన్నాయి. వారెలాంటి తప్పు చేయలేదు కనుకే... అక్రమ సొత్తేదీ సోదాల్లో లభించలేదు. అయినా, పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకొస్తామంటే ఇబ్బందిపెట్టారు. మాకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది. అంతిమంగా న్యాయం, ధర్మమే గెలుస్తాయి. 

ప్రశ్నపత్రం వెల్లడిపై స్పందనేదీ? 

నీట్‌ జరగడానికి ముందే బిహార్, గుజరాత్‌లలో ప్రశ్నపత్రాలను రూ.30 లక్షలకు అమ్ముకున్నారనే వార్తలు వస్తున్నాయి. నిందితులను బిహార్‌ పోలీసులు అరెస్టు చేసినా బాధ్యులపై ఈడీ ఎందుకు దాడులు చేయట్లేదు? ప్రశ్నపత్రం లీకైందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడంలేదు’’ అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని