హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలకు ఈసీ కసరత్తు

ఇటీవలే సార్వత్రిక పోరును విజయవంతంగా ముగించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మరో సమరానికి సిద్ధమైంది. హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్‌లోనూ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమైనట్లు శుక్రవారం వెల్లడించింది.

Published : 22 Jun 2024 05:35 IST

దిల్లీ: ఇటీవలే సార్వత్రిక పోరును విజయవంతంగా ముగించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మరో సమరానికి సిద్ధమైంది. హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్‌లోనూ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమైనట్లు శుక్రవారం వెల్లడించింది. జులై 1, 2024 నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపింది. హరియాణా అసెంబ్లీకి వచ్చే నవంబరు 3, మహారాష్ట్రకు నవంబరు 26, ఝార్ఖండ్‌కు జనవరి 5, 2025 వరకు గడువు ఉంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకూ సమాచారం అందించింది. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజనతో అక్కడి శాసనసభ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి కల్పించనున్నాయి. ఇటీవల లోక్‌సభ పోరులోనూ ఇక్కడి ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. సుప్రీం కోర్టు సైతం సెప్టెంబరు 30లోగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని గత డిసెంబరులోనే ఆదేశించింది. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం గురువారం జమ్మూ పర్యటనలోనూ సాధ్యమైనంత త్వరలోనే ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర హోదాను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో జూన్‌ 25 నుంచి ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించనున్నట్లు ఈసీ వెల్లడించింది. జులై 25న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన, ఆగస్టు 9 వరకు అభ్యంతరాల స్వీకరణ అనంతరం షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 20న తుది జాబితా విడుదల చేయనున్నట్లు ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని