దేశాన్ని బలహీనపరుస్తున్న భాజపా అవినీతి

దేశంలో వివిధ ప్రవేశ పరీక్ష పత్రాలు లీకవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు.

Updated : 22 Jun 2024 05:39 IST

పరీక్ష పేపర్ల లీకులపై ప్రియాంక విమర్శ

దిల్లీ: దేశంలో వివిధ ప్రవేశ పరీక్ష పత్రాలు లీకవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. భాజపా పాలనలో ఈ అంశం జాతీయ సమస్యగా మారిందని, అది కోట్ల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని పేర్కొన్నారు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో అక్రమాలు చోటు చేసుకోవడం, యూజీసీ-నెట్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ప్రియాంక ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. గడచిన అయిదేళ్లలో దేశంలో 43 నియామక పరీక్షల పేపర్లు లీకయ్యాయని ఆరోపించారు. భాజపా పాలనలో దేశంలో పేపర్‌ లీకేజీలు జాతీయ సమస్యగా మారాయన్నారు. ఈ పరిస్థితి కోట్లమంది యువత భవితను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచంలో మనది యువ దేశం. ఇక్కడ అత్యధిక సంఖ్యలో యువత ఉంది. వీరందరినీ నైపుణ్యవంతులుగా, సమర్థులుగా మార్చడానికి బదులు భాజపా సర్కార్‌ వారిని బలహీనులుగా మారుస్తోంది. కోట్లమంది ప్రతిభ గల విద్యార్థులు రాత్రనక, పగలనక కష్టపడి చదువుతూ వివిధ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఆ చదువుల భారాన్నంతా ఆ అభ్యర్థుల తల్లిదండ్రులు సర్వం త్యాగం చేస్తూ భరిస్తున్నారు. ఉద్యోగ నియామక ఖాళీల ప్రకటన కోసం యువత ఏళ్ల తరబడి ఎదురు చూస్తోంది. ఆ ప్రకటన వెలువడ్డాక దరఖాస్తులు పంపేందుకు, పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఎన్నో వ్యయప్రయాసలు కోరుస్తున్నారు. చివరకు అవినీతి కారణంగా వారి ప్రయత్నమంతా వృథా అవుతోంది’’ అని ప్రియాంక ఆరోపించారు. 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు

నీట్‌ లీకేజీ, యూజీసీ-నెట్‌ రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన నిరసనల్లో పలువురు పీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

నీట్‌ పేపర్‌ లీకేజీ కుట్రలో అసలు సూత్రధారి నీతీశ్‌ కుమార్‌: తేజస్వీ యాదవ్‌

పట్నా: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో భాజపా తనను ఇరికించాలని ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ మండిపడ్డారు. కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తితో తేజస్వీ వ్యక్తిగత సహాయకుడికి పరిచయం ఉందని భాజపా ఆరోపించింది. దీనిపై ఆయన స్పందిస్తూ పేపర్‌ లీకేజీకి కుట్ర చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ అని వ్యాఖ్యానించారు. భాజపా అధికారంలోకి వచ్చినప్పుడల్లా పేపర్‌ లీకేజీలు జరుగుతున్నాయన్నారు. ‘‘ఈ విషయంలో ఇండియా కూటమి ఐక్యంగా ఉంది. నీట్‌ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఈ కేసులో నా పీఏను, నన్ను లాగాలనుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పేపర్‌ లీక్‌కు అసలైన సూత్రధారులు అమిత్‌ ఆనంద్, నీతీశ్‌ కుమార్‌లే’’ అని తేజస్వి ఆరోపించారు.ఆర్జేడీ నేతలు తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓ ఫొటోను పంచుకున్నారు. అందులో ప్రధాన నిందితుడు అమిత్‌ ఆనంద్‌ బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరితో ఉన్నారు. కేసులో ఆనంద్‌ పేరు బయటకు రాగానే అతడితో ఉన్న ఫొటోలన్నింటినీ ఉప ముఖ్యమంత్రి డిలీట్‌ చేశారన్నారు. కానీ అవన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని,  వాటి ద్వారా అసలైన దోషులు ఎవరో తెలుస్తోందని పేర్కొన్నారు.


పరీక్ష నిర్వహణే సరిగా లేదు
- థర్డ్‌ పార్టీ సమీక్షలో పలు విషయాలు వెల్లడి

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన ‘నీట్‌-యూజీ 2024’లో తీవ్ర నిర్వహణ లోపాలు ఉన్నట్లు ఎన్‌టీఏ థర్డ్‌పార్టీ రివ్యూలో గుర్తించారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా సుమారు 4,000 కేంద్రాల్లో జరిగింది. వీటిల్లో 399 సెంటర్లను థర్డ్‌పార్టీ స్వయంగా పరిశీలించింది. కొన్నిచోట్ల పరీక్ష జరుగుతున్న గదుల్లో సీసీ కెమెరాలు లేవని.. ఉన్నా కొన్నిచోట్ల పనిచేయడం లేదని గుర్తించారు. ఎన్‌టీఏ నిబంధనల ప్రకారం పరీక్ష గదిలో కచ్చితంగా రెండు కెమెరాలు ఉండాల్సిందే. దీంతోపాటు ఆయా సెంటర్లలో ప్రశ్నపత్రాలను భద్రపర్చినచోట గార్డుల రక్షణ లేని విషయాన్ని గమనించారు.

  • ఈ రివ్యూను పరీక్ష జరిగిన రోజునే ఆయా కేంద్రాల్లో నిర్వహించారు. 399 సెంటర్లలో 186 చోట్ల సీసీ కెమెరాలు లేవు. వాస్తవానికి వీటి నుంచి లైవ్‌ఫీడ్‌ దిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
  • 68 చోట్ల ప్రశ్నపత్రం భద్రపర్చిన గదికి గార్డులను రక్షణగా నియమించలేదు. నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రం పంపిణీ చేసేవరకు కచ్చితంగా గార్డ్‌ రక్షణ ఉండి తీరాలి. 
  • 83 సెంటర్లలో బయోమెట్రిక్‌ జాబితాలో ఉన్న సిబ్బంది.. విధుల్లో ఉన్నవారు వేర్వేరు కావడం గమనార్హం.
  • పరీక్ష రోజున ఏ సెంటర్‌లోనూ మాల్‌ప్రాక్టిస్‌ వంటివి జరగకుండా చూసేందుకు ఈ రివ్యూను నిర్వహిస్తారు. దీనికింద పరిశీలకులను థర్డ్‌ పార్టీ నియమిస్తుంది. వీరు ఎన్‌టీఏ నిబంధనల అమలుతీరును ఎలా ఉందో గమనించి నివేదిక ఇస్తారు.

‘నీట్‌’ను పార్లమెంటులో ప్రస్తావిస్తా : రాహుల్‌

దిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌లో చోటుచేసుకున్న అవకతవకలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ అంశాన్ని తాను వ్యక్తిగతంగా పార్లమెంటులో లేవనెత్తుతానని వెల్లడించారు. విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వంపై ప్రతిపక్షం ఒత్తిడి తెస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రుల చేతకానితనం వల్ల లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అనిశ్చితిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని