సింగరేణిలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?

సింగరేణిలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా..? అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ సవాల్‌ చేశారు.

Published : 22 Jun 2024 05:38 IST

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి సంజయ్‌ సవాల్‌

కరీంనగర్‌లో యోగా చేస్తున్న బండి సంజయ్‌

ఈనాడు - కరీంనగర్, జమ్మికుంట - న్యూస్‌టుడే: సింగరేణిలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా..? అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. శుక్రవారం జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో, అనంతరం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణిపై కాంగ్రెస్, భారాస తప్పుడు ప్రచారాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణి వ్యవహారాలపై సీబీఐ విచారణ కోరాలన్నారు. దానివల్ల గత ప్రభుత్వ నిర్వాకం, సింగరేణిని ఈ దుస్థితికి తీసుకొచ్చిందెవరో బయటపడతాయన్నారు. ఆ సంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించినా.. ఆ రెండు పార్టీలు భాజపాపై విమర్శలు చేయడం సరైనది కాదన్నారు. సింగరేణి దుస్థితికి కేసీఆరే కారణమని, అది ఆయన కుటుంబానికి ఏటీఎంగా మారిందని సంజయ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో వివిధ అంశాలపై సిట్‌ల దర్యాప్తులను నీరుగార్చినట్టే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఫోన్‌ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలపై విచారణలను జాప్యం చేస్తోందని దుయ్యబట్టారు.  

నేరస్థులపై ఉక్కుపాదం మోపాలి

రాష్ట్ర ప్రభుత్వం నేరస్థులపై ఉక్కుపాదం మోపాలని బండి సంజయ్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నిరుపేద చెంచు మహిళపై దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. భారాస హయాంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అమానవీయ ఘటనలు కాంగ్రెస్‌ హయాంలోనూ కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇంతకుముందు పెద్దపల్లి, నారాయణపేటల్లోనూ దారుణాలు జరిగాయన్నారు. భారాస పాలనలో గూండాయిజం, అక్రమాలు చేసిన వారినే కాంగ్రెస్‌ పార్టీ వెంట పెట్టుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గతంలో భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జి చేసి, జైళ్లలో పెట్టిన కొంత మంది పోలీసు అధికారులను ప్రభుత్వం పదోన్నతులతో పెంచి పోషిస్తోందన్నారు. ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ధి చేస్తానని సంజయ్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని