కాంగ్రెస్‌ దళితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

భారాస అధికారంలో ఉండగా దళితులను ధనికులను చేయాలనే చిత్తశుద్ధితో దళిత బంధు పథకాన్ని అమలు చేశామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు.

Published : 22 Jun 2024 05:41 IST

సిరిసిల్లలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌

ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కేటీఆర్‌ 

ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: భారాస అధికారంలో ఉండగా దళితులను ధనికులను చేయాలనే చిత్తశుద్ధితో దళిత బంధు పథకాన్ని అమలు చేశామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం పదిర, సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం పర్యటించారు. తొలుత పదిరలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత సిరిసిల్లలో నూతనంగా ఎన్నికైన అర్బన్‌ బ్యాంకు పాలకవర్గం అభినందన సభలో పాల్గొన్నారు. దళిత బంధు పథకం తీసుకురావడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్‌ వంటి నాయకులకే సాధ్యమన్నారు. ఎన్నికల్లో భారాస దళిత బంధు పథకంలో రూ.10 లక్షలు ప్రకటిస్తే, కాంగ్రెస్‌ రూ.12 లక్షలు ఇస్తామన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని, వారు ఇచ్చిన మాట ప్రకారం రూ.12 లక్షలతో అంబేడ్కర్‌ అభయహస్తం అమలు చేయాలని పేర్కొన్నారు. దానికి జులైలో జరగబోయే బడ్జెట్‌ సమావేశంలో తగినన్ని నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జనాభాలో 18 శాతం ఉన్న దళితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో చాలాసార్లు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను స్మరించుకున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించి దానికి ఆయన పేరును పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని తొలిసారి హైదరాబాద్‌ నడిబొడ్డున ఏర్పాటు చేసింది కూడా కేసీఆరేనని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని