సంక్షిప్త వార్తలు (9)

నీట్‌ నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని, పరీక్ష నిర్వహించిన ‘ఎన్‌టీఏ’పై చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Updated : 23 Jun 2024 06:54 IST

‘నీట్‌’ నిర్వహణ బాధ్యతలు రాష్ట్రాలకు అప్పగించాలి: ఆర్‌.కృష్ణయ్య

నిరసన ప్రదర్శనలో ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రామకృష్ణ తదితరులు

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: నీట్‌ నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని, పరీక్ష నిర్వహించిన ‘ఎన్‌టీఏ’పై చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. నీట్‌ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికైనా రాష్ట్రాలకు అప్పగించాలన్నారు. నీట్‌ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ తదితరుల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ బర్కత్‌పుర చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ నీల వెంకటేశ్‌తో కలిసి ఆర్‌.కృష్ణయ్య హాజరై సంఘీభావం ప్రకటించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 


నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

బీజేవైఎం డిమాండ్‌

టీజీపీఎస్‌సీ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీజేవైఎం కార్యకర్తలు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గ్రూప్స్‌ అభ్యర్థుల డిమాండ్లను నెరవేర్చాలని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం నాంపల్లిలోని టీజీపీఎస్‌సీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్‌ సహా 83 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు. తోపులాటలో ముగ్గురు యువమోర్చా నేతలకు గాయాలయ్యాయి. వారిని కేర్‌ ఆసుపత్రికి తరలించగా.. పార్టీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. ‘‘గ్రూపు-1 ప్రిలిమ్స్‌లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలి. గ్రూపు-2, 3లలో అదనంగా పోస్టులు పెంచాలి. 25 వేల టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలి. జాబ్‌ క్యాలెండర్‌ను తక్షణమే విడుదల చేయాలి’’ అని యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. 


గాంధీభవన్‌లో కిసాన్‌ కాంగ్రెస్‌ సంబరాలు

హైదరాబాద్, న్యూస్‌టుడే: రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై కిసాన్‌ కాంగ్రెస్‌ శనివారం గాంధీభవన్‌లో సంబరాలు జరిపింది. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ జాతీయ కిసాన్‌ కాంగ్రెస్‌ తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 


జిల్లా, మండల కేంద్రాల్లో వేడుకలకు పిలుపు

రైతు రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా, మండల కేంద్రాల్లో సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు.

పీసీసీ లీగల్‌ సెల్‌ వైస్‌ ఛైర్మన్‌గా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ (జవహర్‌నగర్‌)కు చెందిన న్యాయవాది తిరుపతి వర్మ నియమితులయ్యారు.  


బొగ్గు వేలానికి వ్యతిరేకంగా 28, 29లలో ధర్నాలు

సీపీఎం కార్యదర్శి తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం విమర్శించింది. ‘కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోనే బొగ్గు వేలం ప్రక్రియను ప్రారంభించడం ఆందోళనకరం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొనడం ఆశ్చర్యకరం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారాస పాలనలో రెండు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే అప్పగించాలని కోరారు. ఈ డిమాండ్‌తో ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.


వైకాపా గైర్హాజరు బీసీలను అవమానించడమే: ధూళిపాళ్ల నరేంద్ర

ఈనాడు, అమరావతి: వెనుకబడిన వర్గాలకు చెందిన సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వైకాపా అధ్యక్షుడు జగన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా గైర్హాజరవడం బీసీలను అవమానించడమేని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై జగన్‌కు నమ్మకం లేదని మరోసారి నిరూపించారని మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. కానీ వారు ఓటమిని స్వీకరించేందుకు, వాస్తవాల్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా అహంకారం తగ్గలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్పీకర్‌ ఎన్నిక ఉందన్న విషయాన్ని గత సభలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా వ్యవహరించిన శ్రీకాంత్‌రెడ్డి ద్వారా జగన్‌కు తెలియజేశామని, సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమాచారమిచ్చామని నరేంద్ర తెలిపారు.


కక్ష సాధింపుతోనే వైకాపా కార్యాలయం కూల్చివేత
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణ

తాడేపల్లి, న్యూస్‌టుడే: నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయాన్ని కూల్చేయడం కక్ష సాధింపులో భాగమేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బోట్‌ యార్డు స్థలంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావుతో కలిసి రాంబాబు ఆ శిథిలాలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘వైకాపా కార్యాలయాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో స్థలాలు ఎంపిక చేసి మంత్రివర్గం ఆమోదంతో తీసుకున్నాం. అధికారం ఉందని నిర్మాణంలో ఉన్న మా పార్టీ కార్యాలయ భవనాన్ని కూల్చివేయడం ధర్మమా? జలవనరుల శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని 33 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాం. అనుమతులు లేవని సీఆర్డీఏ నోటీసులిచ్చింది. దీనిపై న్యాయస్థానానికి వెళ్తే నిబంధనలు పాటించాలని ఆదేశించింది’ అని అన్నారు.


ప్రజల పక్షాన నిలవాలి
పార్టీ నేతలతో బీసీవైపీ అధ్యక్షుడు

ఈనాడు, అమరావతి: ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలవాలని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ ఆ పార్టీ నేతలకు సూచించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణ, నియోజకవర్గాల నేతల పనితీరు వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తుతూ అయిదేళ్లూ దశలవారీగా పోరాడదామని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ సమన్వయకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.


జగన్‌ చెప్పిన మాటను ఆయనే మరిచిపోతే ఎలా?
తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు  

ఈనాడు, అమరావతి: అనుమతులు లేకపోతే ఏ కట్టడాన్నైనా కూల్చేయాలని గతంలో జగనే చెప్పారని తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఆయన చెప్పిన మాటను ఆయనే మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘వైకాపా కార్యాలయాన్ని అనుమతులు లేకుండా కడుతున్నారు. అదీ రాజధానిలో కీలకమైన సీడ్‌ యాక్సిస్‌ రహదారికి అడ్డుగా నిర్మిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాన్ని కూల్చడం సబబే. అమరావతిని జగన్‌ ఎంత విధ్వంసం చేశారో అందరికీ తెలుసు. ఇవన్నీ మరిచిపోయి జగన్‌ శోకాలు పెట్టడం దిగజారుడు రాజకీయం. ప్రభుత్వ డబ్బుతో కట్టిన భవనాన్నే కూల్చిన గొప్ప పాలకుడు జగన్‌’ అని అన్నారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో పలువురు నాయకులు మాట్లాడారు.


వైకాపా సభా మర్యాదను పాటించలేదు
-బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యే

స్పీకర్‌ ఎన్నికలో పాల్గొనకుండా వైకాపా సభా మర్యాదను ఉల్లంఘించింది. సభ విధుల్ని గౌరవిస్తామని ప్రమాణం చేసిన వైకాపా ఎమ్మెల్యేలు ఒక్క రోజులోనే మాట తప్పారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.


మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి
-పంతం నానాజీ, జనసేన ఎమ్మెల్యే

మౌలిక సదుపాయాలను గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసింది. చాలా చోట్ల తాగడానికి మంచినీరు కూడా ప్రజలకు అందుబాటులో లేదు. ఇలా అత్యవసరంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తెదేపా, జనసేన మధ్య సమన్వయం చాలా బాగుంది.


అక్రమ కట్టడాలు తొలగిస్తుంటే ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా?: యామినీ శర్మ 

ఈనాడు డిజిటల్, అమరావతి: గతంలో తెదేపా ప్రభుత్వం కట్టిన ప్రజావేదికను కక్షతో కూల్చిన వైకాపా అధినేత జగన్‌కు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టిన వైకాపా కార్యాలయాలను తొలగిస్తుంటే ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ నిలదీశారు. అయిదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యమనేదే లేకుండా పాలించిన జగన్‌కు ప్రజాస్వామ్యవాదులు ఎలా మద్దతిస్తారు? ఎందుకిస్తారు అని శనివారం ఆమె ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను, ఆస్తులను జగన్‌ తనఖా పెట్టారు. ప్రభుత్వ ఆస్తులు మీ సొంత సొమ్మా? ప్రతి శాఖలో రూ.వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి. అవినీతితో రాష్ట్రాన్ని ఆర్థికంగా చంపేశారు. వైకాపా చేసిన అక్రమాలన్నింటినీ బయటకు తీస్తాం. తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతాం’ అని పేర్కొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని