కాంగ్రెస్‌ మీకు అండగా ఉంటుంది

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ గేమింగ్‌ జోన్‌లో గతనెలలో జరిగిన అగ్నిప్రమాదంలో కొందరు బాధితుల బంధువులను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం పరామర్శించారు.

Published : 23 Jun 2024 04:35 IST

రాజ్‌కోట్‌ ప్రమాద బాధిత కుటుంబాలకు రాహుల్‌ భరోసా

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ గేమింగ్‌ జోన్‌లో గతనెలలో జరిగిన అగ్నిప్రమాదంలో కొందరు బాధితుల బంధువులను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం పరామర్శించారు. దాదాపు 30 నిమిషాలు సాగిన ఈ సమావేశంలో పార్టీ అండగా ఉంటుందని రాహుల్‌ వారికి భరోసా ఇచ్చారు. గత నెల 25న రాజ్‌కోట్‌లో ఉన్న టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌లో అగ్నిప్రమాదం జరిగి 27 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 25న ‘రాజ్‌కోట్‌ బంద్‌’కు పిలుపునిచ్చింది. బాధిత కుటుంబాలకు భాజపా ఇచ్చిన హామీలపై ఒత్తిడి తేవడంతో పాటు వారికి అందించే పరిహారాన్ని పెంచాలన్న డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ బంద్‌ను విజయవంతం చేసేందుకు సహకరించాలని కాంగ్రెస్‌ నేతలు, బాధితుల బంధువులు స్థానికులను కోరారు.   

రాజ్‌కోట్‌ సీఎఫ్‌వో అరెస్టు

గేమింగ్‌ జోన్‌ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి రాజ్‌కోట్‌ నగరపాలక సంస్థ ముఖ్య అగ్నిమాపక అధికారి (సీఎఫ్‌ఎవో) లేశ్‌ ఖేర్,  డిప్యూటీ సీఎఫ్‌వో బైఖా థెబా, టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌ వర్క్‌ సూపర్‌వైజర్‌ మహేశ్‌ రాఠోడ్‌లను పోలీసులు శనివారం అరెస్టుచేశారు. తెబా ఇప్పటికే అవినీతి కేసుకు సంబంధించి జైల్లో ఉండగా, ట్రాన్స్‌ఫర్‌ వారెంట్‌ ద్వారా ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు. అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని