డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ‘జనదర్బార్‌’

ప్రతిపక్షం.. అధికారపక్షం.. ఏ హోదాలో ఉన్నా.. ప్రజా సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిరూపించారు.

Published : 23 Jun 2024 06:29 IST

ప్రజల నుంచి వినతుల స్వీకరణ

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రతిపక్షం.. అధికారపక్షం.. ఏ హోదాలో ఉన్నా.. ప్రజా సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిరూపించారు. జనసేన కేంద్ర కార్యాలయానికి శనివారం వినతులతో వచ్చిన వారిని కలిసి మాట్లాడారు. అసెంబ్లీ నుంచి తిరిగి వస్తుండగా, పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెల్ప్‌డెస్క్‌ వద్ద ఉన్న పలువురి నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటిపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవాణి కార్యక్రమంద్వారా ప్రజల సమస్యలు విని.. పరిష్కారానికి కృషి చేసిన పవన్‌ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. 

కుమార్తె జాడ లేదని..

భీమవరానికి చెందిన ఓ మహిళ విజయవాడలో చదువుకుంటున్న మైనర్‌ అయిన తన కుమార్తెను ప్రేమ పేరుతో 9 నెలల కిందట కిడ్నాప్‌ చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన పవన్‌ మాచవరం సీఐతో ఫోన్లో మాట్లాడి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇల్లు కోసం సొంత మనవళ్లే తమను వేధిస్తున్నారని మాచర్ల నియోజకవర్గం రెంటచింతల గ్రామానికి చెందిన మత్స్యకారుడు జంపయ్య దంపతులు వాపోయారు. రాజకీయ కారణాలతో కక్షగట్టి తనను ఉద్యోగం నుంచి తొలగించారని జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పనిచేస్తున్న పాటి నాగరాజు చెప్పారు. సుమారు 30 మంది దివ్యాంగులు వారి సమస్యలను ఏకరువు పెట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన సువర్ణ అనే మహిళ తన కుమారుడికి బ్రెయిన్‌ శస్త్రచికిత్సకు ఆర్థికసాయం చేయాలని విన్నవించారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని పవన్‌ వారికి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని