పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు షోకాజ్‌ నోటీసులు

ఏఐసీసీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆర్థిక అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాకేష్‌రెడ్డిలకు పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Published : 23 Jun 2024 05:30 IST

వారంలోపు సమాధానమివ్వాలని పార్టీ ఆదేశం  

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: ఏఐసీసీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆర్థిక అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాకేష్‌రెడ్డిలకు పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ లింగంశెట్టి ఈశ్వరరావు వారిద్దరికి వేర్వేరు నోటీసులు పంపారు. పద్మశ్రీ, రాకేష్‌రెడ్డిలు.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా, పార్టీలోని తిరుగుబాటు గ్రూపులతో కలిసి బహిరంగంగా మీడియా సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేశారని, పార్టీ ప్రతిష్ఠ, నాయకత్వానికి తీవ్రమైన నష్టం కలిగించారని పేర్కొన్నారు. వారు చేసిన ఆరోపణలపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. 

కార్యాలయాలకు తాళాలు వేయడంపై ఫిర్యాదు 

విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లోని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల కార్యాలయాలకు బలవంతంగా తాళాలు వేయడంపై సుంకర పద్మశ్రీ, రాకేష్‌రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్‌కు లేఖ రాశారు. తాము 18 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నామని, 2023 నుంచి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నామని తెలిపారు. ఈ నెల 21న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు సరైన సమాచారం ఇవ్వకుండానే కార్యాలయాలకు తాళాలు వేశారని, మా పేర్లున్న బోర్డులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ నియమించిన అన్ని కమిటీలను పీసీసీ ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని