తెదేపా ప్రభుత్వంపై గట్టిగా పోరాడదాం

‘ఎన్నికల్లో వైకాపా ఓటమి ఊహించనిది. ఎవరూ అధైర్యపడొద్దు. తెదేపా ప్రభుత్వంపై గట్టిగా పోరాడదాం’ అని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 23 Jun 2024 06:44 IST

 పులివెందుల పర్యటనలో మాజీ సీఎం జగన్‌ 

వైఎస్సార్‌ జిల్లా వేంపల్లెలో కార్యకర్తలతో కరచాలనం చేస్తున్న మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

పులివెందుల, వేముల, కడప నేరవార్తలు, చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: ‘ఎన్నికల్లో వైకాపా ఓటమి ఊహించనిది. ఎవరూ అధైర్యపడొద్దు. తెదేపా ప్రభుత్వంపై గట్టిగా పోరాడదాం’ అని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో వైకాపా ఓటమి అనంతరం శనివారం తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వచ్చిన ఆయన కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో కలిసి రోడ్డు మార్గంలో పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు ఎస్వీ సతీష్‌రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, రాయచోటి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. 

తోపులాటలో పగిలిన కార్యాలయ అద్దాలు..

 పులివెందులలోని భాకారాపురంలో జగన్‌ కార్యాలయంలోకి వెళ్లే క్రమంలో పెద్దసంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానుల మధ్య తోపులాట జరిగి కార్యాలయంలోని రెండు అద్దాలు పగిలాయని, ఒకరికి గాయాలయ్యాయని పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఆది, సోమవారాల్లోనూ పులివెందులలోనే జగన్‌ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

దెబ్బతిన్న ఇన్నోవా కారు ముందుభాగం

జగన్‌ కాన్వాయ్‌లోని అగ్నిమాపక వాహనాన్ని ఢీకొన్న ఇన్నోవా 

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌లోని అగ్నిమాపక వాహనాన్ని కాన్వాయ్‌లో లేని వాహనం ఢీకొట్టింది. కడప ఫాతిమా కళాశాల వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీకేదిన్నె పోలీసులు తెలిపారు. శనివారం జగన్‌ కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గాన కాన్వాయ్‌లో పులివెందులకు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని