ఈయన వైకాపాచార్యులు!

అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు.. వైకాపా పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కు తగ్గడం లేదు. అసెంబ్లీలోకి రాకుండా ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానళ్లపై వైకాపా హయాంలో నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Updated : 23 Jun 2024 06:20 IST

స్పీకర్‌ దస్త్రం సిద్ధం  చేయమన్నా స్పందన కరవు
తీవ్ర చర్చనీయాంశమైన అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యుల వైఖరి

ఈనాడు, అమరావతి: అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు.. వైకాపా పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కు తగ్గడం లేదు. అసెంబ్లీలోకి రాకుండా ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానళ్లపై వైకాపా హయాంలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ నిషేధాన్ని రద్దు చేయాలని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. సెక్రటరీ జనరల్‌కు ఈ నెల 20న విజ్ఞాపనపత్రం సమర్పించారు. దానిపై ఎలాంటి చర్యా తీసుకోకపోవడంతో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను శనివారం ఉదయం నరేంద్ర కలిశారు. తాను ఇచ్చిన లేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి సెక్రటరీ జనరల్‌కు సూచించగా ‘వాళ్లందరికీ పాస్‌లు ఇచ్చాం, ఇప్పుడు లోపలికి రావచ్చు’ అని చెబుతూ, నిషేధం ఎత్తివేతను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అనంతరం సెక్రటరీ జనరల్‌ను స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పిలిపించుకుని తాను స్పీకర్‌గా తొలి సంతకం ఈ ఛానళ్ల నిషేధం ఎత్తివేతపైనే పెడతానని, దస్త్రాన్ని సిద్ధం చేసి తీసుకురావాలని ఆదేశించారు. అప్పుడూ ఆయన నిబంధనల గురించి చెబుతుండగా.. ‘నేనేమీ సభలో కాదు కదా సంతకం చేసేది.. ఛాంబర్‌లో బాధ్యత తీసుకున్నపుడు చేస్తాను. ముందు దస్త్రం సిద్ధం చేసుకుని రండి’ అని స్పీకర్‌ స్పష్టంగా ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఈ దస్త్రం గురించి అడగగా ఓ పాత దస్త్రాన్ని రామాచార్యులు ఆయన ముందుంచారు. ‘పూర్తిగా సిద్ధం చేయని ఈ ఫైల్‌పై నేను ఎక్కడ సంతకం చేయాలి..? కంప్యూటర్‌లో టైప్‌ చేయలేదా’ అని ప్రశ్నించడంతో రామాచార్యులు నీళ్లు నమిలారు. అదే దస్త్రాన్ని అటూ ఇటూ తిప్పి చూపిస్తుండటంతో స్పీకర్‌ కలగజేసుకుని ‘నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు దస్త్రంలో ఎక్కడా లేదేంటి? అది చేసుకుని రండి’ అని చెప్పారు. దీంతో ఆ పాత దస్త్రం చివర్లోనే తన సహాయకుడితో పెన్‌తో రాయించేందుకు సెక్రటరీ జనరల్‌ సిద్ధమయ్యారు. అప్పుడూ ఆయన తటపటాయిస్తుండటం చూసిన స్పీకర్‌.. ‘నిషేధాన్ని వెంటనే ఎత్తేస్తూ చర్యలు తీసుకోండి’ అని రాయండని చెప్పారు. సహాయకుడు అది రాయడంతో స్పీకర్‌ సంతకం పెట్టారు. అలా చివరి వరకూ స్పీకర్‌ను కూడా ఏమార్చేందుకు సెక్రటరీ జనరల్‌ రామాచార్యులు అన్ని విధాలా ప్రయత్నించడం అసెంబ్లీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని