అయ్యన్నపాత్రుడికి ఇక తిట్టే అవకాశం లేనట్టే

‘‘అయ్యన్నపాత్రుడికి కోపమొస్తే రుషికొండను చెక్కినట్లుగా పదునైన ఉత్తరాంధ్ర యాసలో ప్రత్యర్థులకు గుండు కొట్టేస్తారు. అలా తిట్టే అవకాశం ఇకపై మీకు లేనట్టే.

Published : 23 Jun 2024 05:36 IST

ఎవరైనా తిడుతుంటే వారి మైక్‌ కట్‌ చేసే బాధ్యత ఆయనదే
ఇన్నాళ్లూ అయ్యన్న వాగ్ధాటి చూశారు... ఇకపై హుందాతనాన్ని చూస్తారు
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ 

శాసనసభలో తొలిసారి ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘‘అయ్యన్నపాత్రుడికి కోపమొస్తే రుషికొండను చెక్కినట్లుగా పదునైన ఉత్తరాంధ్ర యాసలో ప్రత్యర్థులకు గుండు కొట్టేస్తారు. అలా తిట్టే అవకాశం ఇకపై మీకు లేనట్టే. సభలో ఎవరైనా సభ్యులు తిడుతుంటే వారి మైక్‌ కట్‌ చేసి ఆపే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మా చిన్నప్పుడు బాగా అల్లరి చేసే అబ్బాయిలను క్లాస్‌ లీడర్‌గా చేసేవారు. ఇన్నాళ్లూ మీలోని ఘాటైన వాగ్ధాటిని చూసిన రాష్ట్ర ప్రజలు ఇకపై మీ హుందాతనాన్ని చూస్తారు’’ అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. సభాపతిగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని అభినందిస్తూ పవన్‌కల్యాణ్‌ శనివారం అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన సభాపతిగా బాధ్యతలు స్వీకరించటం ఆనందంగా ఉందన్నారు. 

గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో  శాసనసభను అగౌరవపరిచింది

‘‘వ్యక్తిగత దూషణలతో పవిత్ర శాసనసభను గత ప్రభుత్వం అగౌరవపరిచింది. రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసింది. అందుకే ఆ పార్టీని ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారు. ఈ కొత్త సభ నుంచే భాష నియంత్రణ మొదలవ్వాలి. సభాపతిగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడే ఆ బాధ్యత తీసుకోవాలి.  వైకాపా నాయకులు ఓటమిని సహించలేకపోతున్నారు. అందుకే శాసనసభకు గైర్హాజరయ్యారు. గతంలో ఎవరైనా ప్రజాసమస్యలపై మాట్లాడితే వారి వ్యక్తిగత జీవితాలపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసేవారు. ఇకపై అలాంటి చర్యలు ఆగిపోవాలి. సభా చర్చల్లో సంస్కారహీనమైన భాష, భావాలు ఉండకూడదు. ఎంతటి జటిలమైన సమస్యలైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఈ సభ నిరూపించాలి. ఈ సభ భవిష్యత్తుకు ప్రామాణికం కావాలి. రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్తునిచ్చేలా, రైతులకు అండగా నిలిచేలా, మహిళలకు భద్రత కల్పించేలా, ప్రభుత్వ ఉద్యోగులకు భరోసానిచ్చేలా, ఏపీ అభివృద్ధికి బాటలు వేసేలా ఈ ఐదేళ్లూ సభ నడవాలని ఆకాంక్షిస్తున్నా. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ సభను ప్రతి నిమిషం రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేలా నడపాలి. సత్సంప్రదాయాలను నెలకొల్పాలి’’ అని పవన్‌కల్యాణ్‌ సూచించారు.

జనసేనకు డిప్యూటీ స్పీకర్‌ పదవిపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి

‘శాసనసభలో ప్రతిపక్షం ఉన్నా.. లేకపోయినా, చట్టాల రూపకల్పనకు సంబంధించి కూలంకషంగా చర్చలు జరుపుతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని అంశాలపై లోతుగా చర్చిస్తాం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. జనసేన డిప్యూటీ స్పీకర్‌ పదవి తీసుకునే అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని.. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పదవిని తమ పార్టీ తీసుకుంటుందని చూచాయగా వెల్లడించారు. శాసనసభలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో శనివారం ఆయన్ను కలిసిన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీరాజ్‌ చట్టం చాలా సమర్థంగా ఉందని, దాని లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఎంత పకడ్బందీగా రూపొందించారో తెలుస్తోందన్నారు. ఉన్న అధికారులతోనే గ్రామాలు, పల్లెలు, ప్రజలకు మేలు జరిగేలా సమర్థంగా పని చేస్తానన్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిని కట్టడి చేసి, మరింత సమర్థంగా అమలు చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని