ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా.. సభకొస్తే గౌరవిస్తాననే చెప్పా

‘శాసనసభ ఎప్పటికీ గౌరవ సభనే.. కానీ, గత ప్రభుత్వ సమయంలో కొందరు దుర్మార్గులు దాన్ని కౌరవసభగా మార్చారు. ఇప్పుడు ప్రజలు మాకు బాధ్యతనిచ్చారు.

Updated : 23 Jun 2024 09:53 IST

కానీ, స్పీకర్‌గా నా ఎన్నిక వేళా జగన్‌ సభకు రాలేదు
అసెంబ్లీలో మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ స్పీకర్‌గా తొలి సంతకం చేశా
శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు

ఈనాడు, అమరావతి: ‘శాసనసభ ఎప్పటికీ గౌరవ సభనే.. కానీ, గత ప్రభుత్వ సమయంలో కొందరు దుర్మార్గులు దాన్ని కౌరవసభగా మార్చారు. ఇప్పుడు ప్రజలు మాకు బాధ్యతనిచ్చారు. అదే బాధ్యతతో సభ గౌరవాన్ని కాపాడుకుంటాం’ అని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం స్పీకర్‌ కార్యాలయంలో ఆయన సభాపతిగా బాధ్యతలు తీసుకున్నారు. వైకాపా హయాంలో అసెంబ్లీలోకి ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను రానివ్వకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘ఆయన (జగన్‌)కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. కేవలం 11 స్థానాలొచ్చాయి. ప్రతిపక్ష నేత ఎలా అవుతారు? ఆ హోదా లేకపోయినా సభలోకి వస్తే గౌరవిస్తాననే చెప్పా. స్పీకర్‌ ఎన్నిక సమయంలో సభలోకి రావాలనే స్పృహ లేకపోతే ఎలా? సభా సంప్రదాయాలను ఎంత పెద్దవారైైనా గౌరవించాల్సిందే’ అని అన్నారు. 

దుర్మార్గపు నిర్ణయాన్ని రద్దు చేసినందుకు సంతోషంగా ఉంది

‘ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న పత్రికా వ్యవస్థపై గత ప్రభుత్వ హయాంలో దాడి చేయడమనేది క్షమించరాని విషయం. నాలుగున్నరేళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి.. కక్షతో ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ5లను అసెంబ్లీలోకి రాకుండా నిషేధం విధించారు. నాలుగున్నరేళ్లపాటు వారిని ఎంతలా ఇబ్బంది పెట్టారో, వ్యవస్థలన్నింటినీ ఎంత నాశనం చేశారో చూశాం. ఇప్పుడు స్పీకర్‌గా బాధ్యత తీసుకున్నాక ఆ దుర్మార్గపు నిర్ణయం రద్దుపై తొలి సంతకం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో పత్రికలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతోపాటు, వాటిని ఎలా పరిష్కరించాలనే సూచనలూ అందించాలని కోరుకుంటున్నా’ అని సభాపతి చెప్పారు.

ఇప్పుడలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా!

‘స్పీకర్‌ కుర్చీలో కూర్చోవడం వల్ల నా సహజశైలికి చేతులు కట్టేసినట్లేనని మీరు (విలేకర్లు) అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా, గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలపై, మహిళలపై దాడులు జరిగినప్పుడు నేను గతంలో దూకుడుగా మాట్లాడా. అవతలి వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి కూడా అలా మాట్లాడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నా. అప్పట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా’ అని వ్యాఖ్యానించారు. తనకు ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాన్నిస్తే.. చంద్రబాబు ఎన్నో పదవులిచ్చి గౌరవించారని అయ్యన్నపాత్రుడు గుర్తుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని