రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరే కీలకం

ఈసారి లోక్‌సభలో మన సంఖ్యాబలం పెరిగింది. 16 మంది ఎంపీలూ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియజేయాలి.

Published : 23 Jun 2024 05:41 IST

అమరావతి, పోలవరం సహా విభజన హామీలన్నీ లోక్‌సభలో ప్రస్తావించండి
ప్రతి ఎంపీ కనీసం రెండు శాఖలపై దృష్టి పెట్టండి
ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపిక

సీఎం చంద్రబాబుకు జ్ఞాపిక బహుకరిస్తున్న తెదేపా ఎంపీలు

ఈసారి లోక్‌సభలో మన సంఖ్యాబలం పెరిగింది. 16 మంది ఎంపీలూ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియజేయాలి. ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలి. ప్రతి ఎంపీ కేంద్రంలో ఒకటి రెండు శాఖలపై దృష్టిపెట్టి.. రాష్ట్రంలోనూ ఆ శాఖల్ని సమన్వయం చేసుకోవాలి.

చంద్రబాబు

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో కీలకపాత్ర పోషించాలని, ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలని తెదేపా ఎంపీలకు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధే అందరి ప్రథమ కర్తవ్యం కావాలని సూచించారు. లోక్‌సభలో అమరావతి, పోలవరం నిర్మాణం సహా విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీల గురించి ప్రస్తావించాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావాలని ఉద్బోధించారు.  మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభలో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధివిధానాల్ని వారికి వివరించారు. అమరావతి నిర్మాణానికి పొలం అమ్మి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చిన వైద్య విద్యార్థిని వైష్ణవికి ఉన్న శ్రద్ధ కూడా మాజీ సీఎం జగన్‌కు లేదని మండిపడ్డారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని, కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని నియమించారు. విప్‌గా అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ను ఎంపిక చేశారు. ‘ఈసారి లోక్‌సభలో మన సంఖ్యాబలం పెరిగింది. 16 మంది ఎంపీలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియజేయాలి. ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలి. ప్రతి ఎంపీ కేంద్రంలో ఒకటి రెండు శాఖలపై దృష్టిపెట్టి.. రాష్ట్రంలోనూ ఆ శాఖల్ని సమన్వయం చేసుకోవాలి. కేంద్ర పథకాల్ని, నిధుల్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలి. దేశంలోనే టాప్‌-10 విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.  

ఎక్స్‌ప్రెస్‌ హైవేపై దృష్టిపెట్టండి

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కృషి చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. కేంద్ర పథకాల్ని సద్వినియోగం చేసుకొని పేదలకు గృహ నిర్మాణం సాకారం చేశామని చెప్పారు. ఇప్పుడు కూడా రహదారులు, ఇళ్ల నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ‘రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానమై ఉన్న మార్గాల అభివృద్ధికి తోడ్పడాలి. కేంద్రం సేంద్రియ వ్యవసాయ విధానాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. గతంలో మనం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాం. సంబంధిత కేంద్ర పథకాల్ని ఇప్పుడూ వినియోగించుకోవాలి’ అని చంద్రబాబు చెప్పారు. 

కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కసరత్తు 

పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా దిల్లీకి రావాలని చంద్రబాబును కొందరు ఎంపీలు ఆహ్వానించగా.. ‘నా వాయిస్‌ మీరేగా.. మీరే మాట్లాడండి’ అని ఆయన సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, రాష్ట్రంలోని పలు విమానాశ్రయాల నుంచి దేశవిదేశాలకు కొత్త సర్వీసులు నడపటంతోపాటు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించినట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చంద్రబాబుకు తెలిపారు. మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని శివనాథ్, భరత్, కృష్ణప్రసాద్, కలిశెట్టి అప్పలనాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు సీనియర్‌ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని