సీఎం అంటే ‘కటింగ్‌ మాస్టరా’?

‘ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? సీఎం అంటే ‘కటింగ్‌ మాస్టరా’? ఈ పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా?’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 24 Jun 2024 04:05 IST

రైతులకు రుణమాఫీ ఎగ్గొడితే సహించం
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? సీఎం అంటే ‘కటింగ్‌ మాస్టరా’? ఈ పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా?’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను రుణం తెచ్చుకోవాలన్నారు. నేడు రూ.2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదట రుణమాఫీకి రూ.39 వేల కోట్లు అవుతుందని చెప్పారు. ఇప్పుడు రూ.31 వేల కోట్లకు కుదించారు. మొన్న.. లక్షల మందిని రూ.500 సిలిండర్‌ పథకానికి దూరం చేశారు. నిన్న.. 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టారు. నేడు.. పాస్‌పుస్తకాలు లేవనే నెపంతో లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఎగ్గొడతామంటే సహించం. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోం. రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షల రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని