కాంగ్రెస్‌ పాలన మోసపూరితం

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, మోసపూరితంగా వ్యవహరిస్తోందని భారాస  మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

Published : 24 Jun 2024 04:06 IST

విద్యుత్తు ఒప్పందాలపై కమిషన్‌కు సమాచారం ఇస్తా: జగదీశ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, మోసపూరితంగా వ్యవహరిస్తోందని భారాస  మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. భారాస నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆదివారం తెలంగాణ భవన్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘రైతు భరోసా పేరుతో రూ.15 వేలు ఇస్తామని మాట తప్పారు. దీనిపై అసలు క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఎందుకు వేస్తున్నారు? దీని వెనక మతలబు ఏమిటి? రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇవ్వాలి. పింఛన్ల గురించి కాంగ్రెస్‌ ప్రభుత్వం నోరు మెదపడం లేదు.  రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. విద్యుత్తు బిల్లుల మాఫీ రాష్ట్రంలో అమలు కావడం లేదు. విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంపై వారం రోజుల్లో అభిప్రాయం చెప్పాలని విద్యుత్తు కమిషన్‌ నుంచి లెటర్‌ పంపించారు. నా వద్ద ఉన్న సమాచారం కూడా ఇస్తాను. అందరినీ విచారిస్తేనే కమిషన్‌కు సమగ్ర సమాచారం వస్తుంది. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఆ రాష్ట్ర విద్యుత్తు అధికారుల నుంచి కూడా సమాచారం తీసుకోవాలి. మేము లేవనెత్తిన అంశాలపై కమిషన్‌ విచారణ చేయాలి. లేకుంటే కమిషన్‌ ఛైర్మన్‌ బాధ్యతగా తప్పుకోవాలని కోరుతా’’ అని జగదీశ్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని