సింగరేణి బొగ్గు గనులు అమ్మితే ఊరుకోం: మాజీ మంత్రి ఈశ్వర్‌

సింగరేణి బొగ్గు గనులను అమ్మితే ఊరుకోబోమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఇంచు స్థలం అమ్మినా భారాస ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.

Published : 24 Jun 2024 04:07 IST

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: సింగరేణి బొగ్గు గనులను అమ్మితే ఊరుకోబోమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఇంచు స్థలం అమ్మినా భారాస ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ కార్మికులు, యాజమాన్యం కృషితో లాభాలను ఆర్జిస్తోంది. గతంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాజీ సీఎం కేసీఆర్‌ ఒక్క బొగ్గు గని కూడా ప్రైవేటుపరం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు సింగరేణి గనుల వేలానికి నిర్ణయించడం దురదృష్టకరం. తెలంగాణలో 8 మంది భాజపా ఎంపీలు గెలిస్తే తెలంగాణకు ఆ పార్టీ ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇదేనా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన రేవంత్‌.. ఇప్పుడు సీఎం హోదాలో ఎందుకు రాయడం లేదు. వేలంలో పాల్గొనబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం శోచనీయం’’ అని మండిపడ్డారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధూకర్, భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని